
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో జాతీయ రహదారి ప్రాజెక్టులు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాలను కలపడంతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ వివిధ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టారు. శ్రీసత్యసాయి జిల్లాలో 1,452 హెక్టార్లు, అనంతపురం జిల్లాలో 623 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇప్పటికే అనంతపురం జిల్లాలో 312 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించింది.
శ్రీసత్యసాయి జిల్లాలో 216 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించారు. ఏడాదిన్నరలో ప్రాజెక్టులు పూర్తి చేసే విధంగా ముందుకెళుతున్నారు. రోడ్లతో పాటు పలు ప్రాంతాల్లో వంతెనలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులు మొత్తం 2024 సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ జరుగుతోంది.
వివిధ ప్రాజెక్టుల వివరాలు..
= ఉరవకొండ – అనంతపురం – కదిరి – మదనపల్లి – కుప్పం – కృష్ణగిరి వరకూ మొత్తం 197 కిలోమీటర్ల రోడ్డుకు సేకరణ పూర్తి చేయనున్నారు.
= ధార్వాడ్ – హుబ్లి – గదగ్ –కొప్పలæ – హొసపేటె– బళ్లారి – గుత్తి – తాడిపత్రి – ముద్దనూరు – మైదుకూరు – బద్వేల్ – ఆత్మకూరు – నెల్లూరు – కృష్ణపట్నం వరకూ జాతీయ రహదారి–67లో మొత్తం 118 కిలోమీటర్లు చేపడుతున్నారు.
= అనంతపురం – తాడిపత్రి – బనగానపల్లి – గాజులపల్లి – గిద్దలూరు – కంభం – వినుకొండ – నరసరావుపేట – గుంటూరు వరకూ జాతీయ రహదారి 544డీలో భాగంగా భూ సేకరణ చేపడుతున్నారు.
= కొడికొండ – లేపాక్షి – హిందూపురం – మడకశిర వరకూ 544ఈ జాతీయ రహదారిలో 102 కిలోమీటర్ల రోడ్డు చేపడుతున్నారు.
= ముదిగుబ్బ జంక్షన్ ఏర్పాటు చేస్తూ కనెక్టింగ్ ఏర్పాటులో భాగంగా పుట్టపర్తి మీదుగా ఎన్‌హెచ్–44లో కోడూరు వద్ద కలుపుతారు.
= జాతీయ రహదారి ఎన్‌హెచ్ – 716లో ముద్దనూరు – పులివెందుల – కదిరి – ఓబుళదేవర చెరువు – గోరంట్ల – పాలసముద్రం క్రాస్ నుంచి హిందూపురం ఎన్‌హెచ్ 544ఈకి అనుసంధానిస్తారు.
వేగంగా భూసేకరణ
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల మీదుగా ఏర్పాటవుతున్న పలు జాతీయ రహదారులకు భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలామటుకు పూర్తిచేశాం. ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఉన్నాయి. కొంత అటవీ భూములను కూడా డైవర్షన్ చేశారు.
–మధుసూదన్‌రావు, ఈఈ, జాతీయ రహదారులు
Comments
Please login to add a commentAdd a comment