బాపట్ల జిల్లా నుంచి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా
పర్చూరు ముఖ్య నేత కనుసన్నల్లోనే దందా
రెవెన్యూ, అటవీశాఖ భూముల్లో తవ్వకాలు
ట్రక్కుల ద్వారా హైదరాబాద్‌కు తరలింపు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నుంచి వేల టన్నుల ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిపోతోంది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రెవెన్యూ, అటవీభూముల్లో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లలో నింపుతున్నారు. ట్రక్కులన్నీ హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. టిప్పర్లు, ట్రాక్టర్లు ప్రకాశం, పల్నాడు జిల్లాలకు వెళ్తున్నాయి. పర్చూరుకు చెందిన అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుండటంతో అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేతకు అవసరమైనప్పుడు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చే ఒక కంపెనీ అధినేత సమీప బంధువులు ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇసుక తవ్వకాల ప్రాంతంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టి కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో కాపు కాస్తున్నారు. ఎవరైనా వస్తే దాడులు చేసేందుకు వారు వెనుకాడడంలేదు. పోలీసులకు మామూళ్లు వెళ్తుండటంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడటంలేదన్న విమర్శలు వస్తున్నాయి.
కడవకుదురు భూముల నుంచి..
పర్చూరు నియోజకవర్గం చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక (గుట్టలు) భూములు ఉన్నాయి. ఇందులో ప్రైవేటు భూములతోపాటు రెవెన్యూ, అటవీ శాఖ భూములూ ఉన్నాయి. ఈ భూముల్లో ఎస్సీ, ఎస్టీలకు గతంలో పట్టాలు ఇచ్చినా వ్యవసాయానికి పనికిరాకపోవడంతో బీళ్లుగానే ఉంచారు. ఇక్కడ నిర్మాణాలకు పనికొచ్చే నాణ్యమైన ఇసుక ఉండడం, వర్షాకాలం నేపథ్యంలో ఇసుకకు డిమాండ్ పెరగడంతో పర్చూరు అధికారపార్టీ నేత కన్ను పడింది.
అనుచరులనుపెట్టి ఇసుక గుట్టలను అక్రమంగా తరలించి రూ. కోట్లు కొల్లగొడుతున్నారు. కడవకుదురు రైల్వే గేటు ప్రాంతంలో గత పది రోజులుగా తవ్వకాలు మొదలు పెట్టారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో పగటిపూట కాకుండా రాత్రి 10 గంటల ప్రాంతంలో జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ట్రక్కులు, టిప్పర్లు, ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక రూ. 4 నుంచి 8 వేలకు అమ్ముతున్నారు.
ట్రక్కు ఇసుక రూ. 80 వేలు..
కృష్ణా, గోదావరి నదులకు నీళ్లు రావడంతో మైదాన ప్రాంతాల ఇసుకకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్లో ఇసుకకు మరింత డిమాండ్ ఉంది. దీంతో కడవకుదురు నుంచి రోజూ 15 ట్రక్కుల్లో హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్క ట్రక్కు (18 టన్నులు) ఇసుక రూ. 80 వేలకు తగ్గకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment