సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ, శాసన మండలి సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు, మండలి సమావేశాలు 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం కానుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏ అంశాలపై చర్చించాలనే దానిపై ఈ సమావేశంలో అజెండా ఖరారు కానుంది. రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనుంది.
సమావేశాలు సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. అసెంబ్లీ, మండలి సమావేశాల నేపథ్యంలో బుధవారం శాసనసభ కమిటీ హాల్‌లో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉన్నతాధికారులతో సమావేశమై బందోబస్తు, ఇతర ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. పటిష్టమైన పోలీస్, మార్షల్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధికారులను ఆదేశించారు.
మార్షల్స్ అప్రమత్తంగా ఉండాలి
మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్.. పోలీస్ అధికారులతో శాంతి భద్రతల అంశాన్ని సమీక్షిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలీస్, మార్షల్స్ ఎంతో అప్రమత్తంగా ఉండాలని, పాస్ లేకుండా ఏ ఒక్కరినీ అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించ వద్దని రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి వారు సూచించారు. ఈ సారి పాస్‌ల జారీని కూడా సాధ్యమైనంత నియంత్రించాలని.. ప్రముఖులు, అధికారులు, సిబ్బంది మినహా ఇతరులకు ఎటువంటి విజిటింగ్ పాస్‌లు జారీ చేయవద్దని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులను ఆదేశించారు.
సభ్యులు సమావేశాలకు సకాలంలో హాజరయ్యేలా వారి రాకపోకలకు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, వారు బసచేసే ప్రాంతాల్లో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కోరారు. సచివాలయం నాలుగు వైపులా పటిష్టమైన పోలీస్ బందోబస్తుతో పాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో పటిష్టమైన నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎటువంటి ఏమరపాటు లేకుండా ఎంతో అప్రమత్తంగా పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించాలని సూచించారు.
సభ్యులకు సంతృప్తికర సమాధానాలు
అంతకు ముందు పలు శాఖల కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, శాసన సభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు సమావేశాలను సజావుగా నిర్వహించడంలో పలు శాఖల కార్యదర్శులు, అధికారులు ఎంతగానో సహకరించారని, అదే సహకారాన్ని ఇకపైనా కొనసాగించాలని కోరారు. ఎన్నికలు జరిగే సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో గౌరవ సభ్యులు పలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడుగుతుంటారని, వాటన్నింటికీ సమావేశాల నిర్వహణ సమయంలోనే సంతృప్తికర స్థాయిలో సమాధానాలు ఇవ్వాలని సూచించారు.
గౌరవ సభ్యులు వారి నియోజకవర్గాల సమస్యలను సభలో చెప్పుకునేందుకు జీరో అవర్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఆ సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను అధికారులు వెంటనే అందజేయాలన్నారు. పలు శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న స్టార్డు, అన్ స్టార్డు, షార్టు నోట్ ప్రశ్నలను వివరిస్తూ వాటన్నింటికీ వెంటనే సరైన సమాధానాలను అందజేసి జీరో స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేందుకు, వారి పిటిషన్లను సత్వరమే పరిష్కరించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను సత్వరమే రూపొందించాలని ఐటీ అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలను సచివాలయం నాలుగవ బ్లాకు పబ్లిసిటీ సెల్ నుండి మీడియాకు అందజేసేలా సమాచార శాఖ ఏర్పాట్లు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment