ప్రతీకాత్మక చిత్రం
తెనాలిటౌన్(పల్నాడు): నిమ్మ మార్కెట్లో ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో తమ ఆశలు ఫలించనున్నాయనే ఆనందం రైతుల్లో వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం కిలో రూ.80 నుంచి రూ.140 వరకు ధర పలుకుతోంది. గతంలో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల పూత రాలిపోయి దిగుబడి తగ్గింది. దీనికితోడు వేసవితోపాటు, తోటల్లో తగినంత కాపు లేకపోవడం వల్ల డిమాండ్ పెరిగింది. మార్కెట్‌లో 50కిలోల టిక్కి రూ.6,000 నుంచి రూ.8,000 వరకు పలుకుతోంది. దీనివల్ల ప్రస్తుతం తోటల్లో కాపు ఉన్న రైతులకు వరంగా మారింది.
తెనాలి ప్రసిద్ధి
రాష్ట్రంలో గూడూరు, ఏలూరు మార్కెట్ల తర్వాత నిమ్మకాయలకు తెనాలి ప్రసిద్ధి. జిల్లాలో 6,000 ఎకరాల నిమ్మ తోటలు ఉంటే అందులో అత్యధిక విస్తీర్ణం తెనాలి డివిజన్‌లోనే ఉంది. ఏటా జూలై, డిసెంబరు, మే నెలల్లో కాపు ఆరంభమైన ప్రతిసారీ మూడునెలలు దిగుబడినిస్తుంది. నిమ్మతోటల సాగుతో ఎంతోకొంత నికరాదాయం వస్తుండటంతో రైతుల్లో మోజు పెరిగింది.
మాగాణి భూముల్లోనూ నిమ్మతోటలు నాటుతున్న రైతులు ఉన్నారు. లాభదాయకంగా లేని సపోటా తోటల్లో సింహభాగాన్ని నిమ్మ ఆక్రమించింది. దీంతో తోటల కౌలు ధరలు భారీగా పెరిగాయి. ఎకరా కౌలు ధర రూ.70 నుంచి రూ.80వేల వరకు ఉంది. ఖర్చు రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు అవుతోంది. ధరలు ఇలాగే కొనసాగితే ఎకరానికి రూ.50వేలు లాభం చేకూరే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
రోజుకు వెయ్యి బస్తాల సరుకు
ప్రస్తుతం ఈ ప్రాంతంలో పంట అంతగా లేకపోవడంతో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి నిమ్మకాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. రోజుకు వెయ్యి బస్తాల సరుకు దిగుమతి అవుతోంది. ఇక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తున్నట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి జె.వి.సుబ్బారావు తెలిపారు. తెనాలి ప్రాంతం నుంచి గతంలో రోజుకు నాలుగు లారీల సరుకు వచ్చేదని, ప్రస్తుతం రెండు లారీలు మాత్రమే వస్తోందని తెలిపారు.
విపరీతంగా పెరిగిన ధరలు
మార్కెట్‌లో నిమ్మ ధరలు రైతులకు ఆశాజనకంగా ఉన్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో వర్షాలు కురవడంతో పంట పూత రాలిపోయింది. అందువల్ల దిగుబడి తగ్గింది. డిమాండ్ పెరిగింది. వేసవికాలం కావడంతో ఉత్తరాది ప్రాంతాలకు సరుకు ఎక్కువగా వెళ్తుంది. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగాయి. – జె.వి.సుబ్బారావు, మార్కెట్ కమిటీ కార్యదర్శి, తెనాలి
Comments
Please login to add a commentAdd a comment