చిరుత పిల్ల
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అడవి గొల్లపల్లి సమీపంలోని ఓ నీటికుంటలో శుక్రవారం చిరుత పిల్ల లభ్యమైంది. అటవీ ప్రాంతం నుంచి దారి తప్పి వచ్చిన ఆ చిరుత పిల్ల నీటి కుంటలో పడి ఉండటాన్ని గ్రామస్తులు చూసి అటవీ శాఖ అధికారులకు సమాచరమిచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్‌సింగ్, ఎఫ్‌ఎస్‌వో షాన్‌వాజ్, జగన్నాథ్, సిబ్బందితో వెళ్లి కుంటలో పడిన చిరుత పిల్లను రక్షించి బోనులోకి చేర్చారు. తల్లి జాడ కోసం సుమారు మూడు గంటల పాటు నిరీక్షించారు. అయినా జాడ తెలియలేదు.
దీంతో చిరుత పిల్లను కళ్యాణదుర్గంలోని అటవీ శాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. జిల్లా అటవీ శాఖ అధికారి సందీప్, సబ్ డీఎఫ్‌వో శామ్యూల్ కళ్యాణదుర్గం చేరుకుని దాన్ని పరిశీలించారు. పశు వైద్యుడు ప్రసాద్ సమక్షంలో దాని వయసు 45 రోజులుగా నిర్ధారించారు. అనంతరం పాలు పట్టించారు. చాలా చిన్న వయసు కావడంతో అడవిలో వదిలిపెట్టలేమని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరుపతి జంతు ప్రదర్శనశాలకు తరలిస్తున్నామని డీఎఫ్‌వో చెప్పారు. తల్లితో పాటు నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు కుంటలో పడి ఉంటుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment