యునెస్కోలో ‘లేపాక్షి’ | Lepakshi Veerabhadraswamy Temple in Unesco | Sakshi
Sakshi News home page

యునెస్కోలో ‘లేపాక్షి’

Published Wed, Mar 30 2022 3:28 AM | Last Updated on Wed, Mar 30 2022 4:15 AM

Lepakshi Veerabhadraswamy Temple in Unesco - Sakshi

సాక్షి, అమరావతి: విజయనగర సామ్రాజ్యాధీశుల కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచే అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల జాబితాలో చోటు సాధించడం ద్వారా అంతర్జాతీయంగా కీర్తి ప్రతిష్టలు, పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది. అత్యద్భుత శిల్ప కళా సౌందర్యం.. ప్రపంచంలోనే పెద్దదైన ఏక శిలా నందీశ్వరుడు.. గాలిలో వేలాడే స్థంభం.. ఏడు పడగల భారీ నాగేంద్రుడు.. అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతి బింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం. యునెస్కో కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి చోటు దక్కించుకుంది. మన దేశం నుంచి మూడు ప్రాంతాలను ప్రతిపాదించగా అందులో లేపాక్షి ఉండటం విశేషం. మహారాష్ట్ర కొంకణ్‌ ప్రాంతంలో క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మ లు (జియోగ్లిఫ్స్‌), మేఘాలయలోని సహజసిద్ధ రబ్బరు చెట్ల మూలాలతో నిర్మించిన వంతెనలు (లివింగ్‌ రూట్‌ బ్రిడ్జి) ఈ జాబితాలో ఉన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో..
విభజన అనంతరం నిర్లక్ష్యానికి గురైన వారసత్వ సంపదను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పురావస్తు శాఖ కమిషనర్‌ వాణిమోహన్‌ ఆధ్వర్యంలో ఇటీవల లేపాక్షి విశిష్టతపై ప్రత్యేక సంచికను రూపొందించి యునెస్కో గుర్తింపు కోసం కేంద్ర పురావస్తు శాఖకు పంపారు. ఈ క్రమంలో కేంద్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో తొలి ప్రయత్నంలోనే లేపాక్షికి స్థానం దక్కింది. మరో ఆరు నెలల్లో తుది జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో లేపాక్షిని యునెస్కో వారసత్వ గుర్తింపు ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో 32 సాంస్కృతిక, చారిత్రక కట్టడాలు, ఏడు సహజ సిద్ధ ప్రదేశాలు, ఒకటి మిశ్రమ జాబితాలో వారసత్వ హోదాను పొందాయి. 

కళా కౌశలానికి ప్రతీక..
16వ శతాబ్దంలో 70 స్తంభాలతో నిర్మించిన లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం విజయ నగర ప్రభువుల కళాతృష్ణ, నాటి సాంకేతిక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆలయంలోని 69 స్థంభాలు పైకప్పు భారాన్ని మోస్తుండగా ఒక స్థంభాన్ని మాత్రం గాలిలో వేలాడేలా ఏర్పాటు చేయడం విశేషం. నాట్య మండపం, మధ్యయుగం నాటి నిర్మాణ చాతుర్యంతో పురాతన శివాలయం, చక్కని ఎరుపు, నీలి, పసుపుపచ్చ, ఆకుపచ్చ, నలుపు, తెలుపు వర్ణాల్లోని కలంకారీ చిత్రాలు శ్రీకృష్ణదేవరాయల చిత్రలేఖన అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. ముఖమండçపం పైకప్పులో చిత్రీకరించిన రామాయణ, మహాభారత పౌరాణిక గాథలు ఆకట్టుకుంటున్నాయి. 

జయహో లేపాక్షి
లేపాక్షి: యునెస్కో విడుదల చేసిన జాబితాలో లేపాక్షి ఆలయానికి చోటు దక్కడంతో స్థానికంగా సంబరాలు మిన్నంటాయి. నందీశ్వరుడి విగ్రహం వద్ద గ్రామస్తులు కేక్‌ కట్‌ చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. జయహో లేపాక్షి అంటూ నినాదాలు చేశారు. జాబితాలో లేపాక్షికి శాశ్వత గుర్తింపు దక్కేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement