సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించడం ద్వారా వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని సర్కార్ సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం వారికి డిజిటల్ బోధనను అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలి దశ నాడు–నేడు స్కూళ్లలో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు 30,213 తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ (ఐఎఫ్‌పీ)లను అమర్చింది. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూళ్లలో 10,038 స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేసింది.
తరగతి గదుల డిజిటలైజేషన్‌లో భాగంగా..
ఇక ఇప్పుడు నాడు–నేడు కింద రెండో దశ స్కూళ్లలో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీవీల ఏర్పాటు చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి వరకు డిజిటలైజేషన్‌లో భాగంగా తరగతి గదుల్లో 28,014 స్మార్ట్ టీవీల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 65 ఇంచులు గల స్మార్ట్ టీవీల కొనుగోలుకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్స్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానించాలని విద్యా శాఖ నిర్ణయించింది.
వీటి కొనుగోలుకు రూ.100 కోట్ల కన్నా ఎక్కువ వ్యయం అవుతుండటంతో నిబంధనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడిíÙయల్ ప్రివ్యూకు పంపింది. ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 9 వరకు సమర్పించడానికి గడువు విధించింది. అనంతరం జ్యుడిషియల్ ప్రివ్యూ సూచనల మేరకు ఓపెన్ కాంపిటీటివ్ బిడ్ల కోసం టెండర్లను ఆహ్వానించనుంది.
లోపాలుంటే 24 గంటల్లోపే పరిష్కారం
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రతి 60 మంది పిల్లలకు ఒక స్మార్ట్ టీవీ ఏర్పాటు చేసి వాటి ద్వారా బోధించనున్నారు. డిసెంబర్ నాటికల్లా వీటి ఏర్పాటు పూర్తి చేయనున్నారు. స్కూళ్లకు స్మార్ట్ టీవీలను తీసుకువచ్చి అమర్చిన నాటి నుంచి ఐదేళ్ల వారంటీ ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది.
స్మార్ట్ టీవీలను సరఫరా చేసిన తరువాత నెల రోజుల్లోనే వాటి పనితీరులో లోపాలున్నా, సంతృప్తికరంగా పనిచేయకపోయినా వాటి స్థానంలో కొత్తవి అమర్చాల్సి ఉంటుంది. అలాగే వాటిలో ఏమైనా లోపాలుంటే.. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోగా పరిష్కరించాలి. ఒకవేళ స్మార్ట్ టీవీ కొత్తది అమర్చాలంటే మూడు రోజుల్లోపే అమర్చాలనే నిబంధన విధించింది. అదేవిధంగా సేవల కోసం కాల్ సెంటర్ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment