సాక్షి, సత్యసాయి జిల్లా: ఏపీలో టీడీపీ కూటమి మద్యం మాఫీయా రెచ్చిపోతోంది. లాటరీలో మద్యం షాపు దక్కించుకున్న వారిని పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమకే షాపులు ఇవ్వాలని ధర్మవరం, చిత్తూరులో కూటమి నేతలు వార్నింగ్ ఇస్తున్నారు.
తాజాగా ధర్మవరంలో టీడీపీ కూటమి మద్యం మాఫియా రెచ్చిపోయింది. లాటరీ ద్వారా ఎర్రగుంట మద్యం షాపును బాలిరెడ్డి దక్కించుకున్నాడు. దీంతో, మద్యం షాపు తమకు రాసివ్వాలని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు బాలిరెడ్డిని బెదిరింపులకు గురిచేశారు. అయినప్పటికీ కూటమి నేతల బెదిరింపులకు బాలిరెడ్డి తలొగ్గలేదు. ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. బాలిరెడ్డి తెచ్చిన రూ.10లక్షల విలువైన మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. అలాగే, ఎర్రగుంట మద్యం షాపులో లిక్కర్ బాటిల్స్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు.
ఇక, మంత్రి సత్యకుమార్ ధర్మవరం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాస్ లాటరీలో ఐదు మద్యం షాపులు దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతల కనుసన్నల్లోనే మద్యం మాఫియా చెలరేగిపోతోంది.
మరోవైపు.. చిత్తూరు జిల్లాలోనూ మద్యం సిండికేట్ ముఠా బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది. లాటరీలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిని పచ్చ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. తాజాగా పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అన్న కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అరాచకం సృష్టించాడు. బాలకృష్ణ అనే వ్యక్తిని బెదిరింపులకు గురిచేసి అతడి వద్ద నుంచి బలవంతంగా షాప్ లాక్కొన్నాడు.
ఈ సందర్భంగా బాధితుడు బాలకృష్ణ మాట్లాడుతూ..‘బైరెడ్డి పల్లి మండలంలో షాప్ నెంబర్ 87 లాటరీ ద్వారా నాకు వచ్చింది. నేను షాప్ పెట్టకుండా విష్ణువర్ధన్ రెడ్డి బెదిరించాడు. అంతేకాకుండా తన అనుచరులతో భౌతికంగా దాడి చేయించారు. నా చేత బలవంతంగా షాప్ వెనక్కి తీసుకుని, ఆర్-2గా వచ్చిన వారికి షాప్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
పలమనేరు నియోజకవర్గం టీడీపీ మద్యం సిండికేట్ బెదిరింపులు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి. కర్ణాటకకు చెందిన వ్యక్తికి షాప్ దక్కడంతో పలమనేరు నేతలు బెదిరింపులకు దిగారు. లక్కీ డిప్ ద్వారా దుకాణాలు దక్కిన వాళ్ళు మద్యం సిండికేట్ మాట వినకుంటే బలవంతంగా ఆర్-1, ఆర్-2గా ఉన్న వాళ్లు దక్కించుకునేలా ఎక్సైజ్ అధికారులతో, పోలీసులతో రాయబారం నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో వారి మాట వినని వారిపై దాడులు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఆమ్రపాలి.. ఆంధ్రాకే!
Comments
Please login to add a commentAdd a comment