సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మద్యం జోరుకు కళ్లెం పడింది. దశలవారీ మద్య నియంత్రణ విధానం సత్ఫలితాలనిస్తోంది. మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే ప్రజారోగ్యమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యాచరణ విజయవంతమవుతోంది. 2019 – 20 కంటే 2020 – 21లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. లిక్కర్ అమ్మకాలు 39 శాతం తగ్గగా బీరు విక్రయాలు ఏకంగా 73 శాతం తగ్గడం విశేషం. ఇక చంద్రబాబు సర్కారు హయాంతో పోల్చి చూస్తే 2018 – 19 కంటే ప్రస్తుతం లిక్కర్ అమ్మకాలు 51 శాతం, బీరు అమ్మకాలు ఏకంగా 80 శాతం తగ్గాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మద్యం అమ్మకాలను ప్రభుత్వం సమర్థంగా కట్టడి చేస్తోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రెండేళ్లలో 51 శాతం తగ్గిన లిక్కర్ అమ్మకాలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018–19లో రాష్ట్రంలో 3.80 కోట్ల లిక్కర్ కేస్‌ల అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019–20లో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు 2.59 కోట్ల కేస్‌లకు తగ్గింది. అంటే 32 శాతం తగ్గాయి. ఇక 2020–21లో రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు కేవలం 1.87 కోట్ల కేస్‌లకే పరిమితమయ్యాయి. 2019–20తో పోలిస్తే 39 శాతం తగ్గాయి. టీడీపీ అధికారంలో ఉన్న 2018–19తో పోలిస్తే లిక్కర్ అమ్మకాలు ఏకంగా 51 శాతం క్షీణించాయి.
80 శాతం తగ్గిన బీరు అమ్మకాలు
బీరు అమ్మకాల జోరును కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా నియంత్రించింది. టీడీపీ హయాంలో 2018–19లో రాష్ట్రంలో 2.90 కోట్ల బీరు కేస్‌లు అమ్మకాలు జరిగాయి. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2019–20లో బీర్ అమ్మకాలు 1.43 కోట్ల కేస్‌లకు తగ్గించారు. అంటే 50 శాతం అమ్మకాలు తగ్గాయి. ఇక 2020–21లో రాష్ట్రంలో బీరు విక్రయాలు కేవలం 57 లక్షల కేస్‌లకే పరిమితమవడం విశేషం. అంటే 40 శాతం బీర్ అమ్మకాలు తగ్గిపోయాయి. టీడీపీ అధికారంలో ఉన్న 2018–19తో పోలిస్తే రాష్ట్రంలో బీరు అమ్మకాలు ఏకంగా 80 శాతం తగ్గడం విశేషం.
బహుముఖ వ్యూహంతో కట్టడి
రాష్ట్రంలో దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని అమలు చేస్తామన్న ఎన్నికల హామీకి అనుగుణంగా సీఎం జగన్ అనుసరిస్తున్న బహుముఖ వ్యూహం సత్ఫలితాలు ఇస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ దుకాణాలను తొలగించారు. మద్యం అమ్మకాలను విపరీతంగా పెంచేందుకు చంద్రబాబు సర్కారు మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లను అనుమతించింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే 4,380 పర్మిట్ రూమ్‌ల అనుమతులను రద్దు చేసి వాటిని తొలగించింది. మద్యం దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే కాకుండా వాటిని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. టీడీపీ హయాంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం కేవలం 2,394 మాత్రమే ఉన్నాయి. మరోవైపు మద్యం దుకాణాల వేళలను కూడా కుదించారు. టీడీపీ సర్కారు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలను అనుమతించగా ప్రస్తుతం ఉదయం 11 నుంచి రాత్రి 8 వరకే అనుమతించారు.
ఆదాయం కాదు.. ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యం
చంద్రబాబు హయాంలో బెల్టు దుకాణాలు, పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇచ్చి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట వేస్తోంది. మద్యం అమ్మకాలను తగ్గించేందుకు సమర్థంగా చర్యలు చేపట్టింది. మా కమిటీ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా పరిస్థితులు తొలగిపోయాక పొదుపు సంఘాల మహిళలు, వార్డు/ గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల ద్వారా మద్యవిమోచన ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తాం.
– వి.లక్ష్మణ్‌రెడ్డి, రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ అధ్యక్షుడు
షాక్ కొట్టే ధరలతో...
మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం షాక్ కొట్టేలా ధరలను పెంచింది. సారా తయారీ, అమ్మకాలను నిరోధించడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో’ను ఏర్పాటు చేసి విస్త్రృత తనిఖీలకు ఆదేశించింది. రాష్ట్రంలో మద్య విమోచన ప్రచార కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మద్యపానంతో కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment