
కావలి: లోన్ యాప్ యాజమానుల దుర్మార్గాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. తాజాగా అప్పు చెల్లించలేదని శ్రీపొట్టిశ్రీరామలు నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ మహిళ ఫొటోను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారికి పంపించి వేధింపులకు గురి చేసిన ఘటన ఆదివారం వెలుగుచూసింది. ఈ మేరకు కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ పి.ఆదిలక్ష్మి కథనం మేరకు.. కావలిలోని కచ్చేరిమిట్టకు చెందిన పసుపులేటి మౌనికను భర్త వదిలేశాడు.
ఆమె తన ముగ్గురు కుమార్తెలను ఉపాధి పనులు చేసుకుంటూ పోషించుకుంటోంది. ప్రస్తుతం ఒక హోటల్‌లో దినసరి కూలీగా పని చేస్తోంది. అయితే, ఆరు నెలల క్రితం ఆన్‌లైన్‌లో ‘స్పీడ్’ అనే యాప్‌లో రూ.5,000 అప్పు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఆమె అకౌంట్‌లో రూ.2,500 నగదు జమ అయింది. అప్పటి నుంచి ఆమెను యాప్‌కు సంబంధించిన వ్యక్తి బ్లాక్‌మెయిల్ చేస్తూ రూ.70 వేల వరకు నగదు ఆమె వద్ద నుంచి కట్టించుకున్నారు.
అయినా ఇంకా బాకీ ఉందని వేధిస్తుండడంతో, ఆమె తనకు ఆర్థిక స్థోమత లేదని చెప్పింది. దీంతో ఆమె ఫొటోను నగ్న చిత్రంతో మార్ఫింగ్ చేసి ‘స్పీడ్’ యాప్ ద్వారా ఆమె కాంటాక్ట్ లిస్ట్‌లోని వారందరికీ పంపారు. బాధితురాలు నుంచి ఫిర్యాదు అందుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment