సాక్షి, చిత్తూరు(పిచ్చాటూరు): ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అడవికొడియంబేడు సమీపంలో అరుణానది ఒడ్డున చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు, ఏఏడబ్ల్యూకు చెందిన మార్కండేయ, గోవిందమ్మ దంపతుల కుమారుడు గుర్రప్ప(22), పక్క గ్రామమైన అడవిశంకరపురం దళితవాడకు చెందిన నాదముని, అంకమ్మ దంపతుల కుమార్తె పల్లవి (18) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లోనూ తెలిసి, పెళ్లికి నిరాకరించారు. దీంతోపాటు గత ఏడాది పల్లవికి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని ప్రయత్నించారు.
అయితే బాల్య వివాహం చేస్తున్నారంటూ గుర్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అది ఆగిపోయింది. ఈ క్రమంలో పల్లవి మేజర్ కావడంతో సోమవారం సాయంత్రం గుర్రప్ప, పల్లవి ఇంటి నుంచి వెళ్లిపోయారు. బుధవారం సాయంత్రం అడవికొడియంబేడు నుంచి అరుణానది ఇసుక రీచ్‌కు వెళ్లే దారిలో శ్మశానం వద్ద ఇరువురూ ఉరేసుకొని మృతి చెందారు. దీన్ని పశువుల కాపరులు గుర్తించారు. వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పుత్తూరు రూరల్ సీఐ సురేష్‌కుమార్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
చదవండి: (ఏఈ హత్య కేసు: ప్రియుడితో కలిసి భార్యే హతమార్చింది)
రెండు కుటుంబాలు కూలితోనే జీవనం: ఆత్మహత్యకు పాల్పడ్డ గుర్రప్ప, పల్లవి కుటుంబాలకు కూలి పనులే ఆధారం. పల్లవి పులికుండ్రంలో పదవ తరగతి.. ఆ తర్వాత నాగలాపురంలో గత ఏడాది ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. పదో తరగతి చదువుకోవడానికి పులికుండ్రం జెడ్పీ హైస్కూల్‌కు వచ్చే సమయంలో మార్గమధ్యంలో ఉన్న అడవికొడియంబేడు ఏఏడబ్ల్యూకు చెందిన గుర్రప్పతో పరిచయం, ప్రేమగా మారింది. గుర్రప్ప 10వ తరగతి పూర్తి చేసి డప్పులు వాయించడంతో పాటు కూలి పని చేస్తున్నాడు.
రెండు కుటుంబాలకు తీరని శోకం: మార్కండేయ, గోవిందమ్మ దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు సంతానం. కూతురు గతంలోనే మరణించగా, కుమారుడు ఇప్పుడు ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా నాదముని, అంకమ్మ దంపతులకు ఒక కూతురు, కొడుకు సంతానం. కొడుకు గత నెలలో మరణించగా, కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఇలా రెండు కుటుంబాల్లోని తల్లిదండ్రులు కన్న బిడ్డలను పోగొట్టుకుని తీరని శోకంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment