సాక్షి, చెన్నై: ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రజానేత దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు సుధాకరరెడ్డి(73) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. శుక్రవారం చెన్నైలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. స్వర్గీయ మాగుంట రాఘవరెడ్డి, కౌసల్యమ్మ దంపతులకు 1949 సెప్టెంబర్ 9వ తేదీన సుధాకరరెడ్డి జన్మించారు. సినీ నిర్మాతగా, పంపిణీ దారుడిగా సుధాకరరెడ్డి పేరు గడించారు.
విషాదంలో కుటుంబం
కొద్ది రోజులుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన సుధాకరరెడ్డి శుక్రవారం మధ్యాహ్నం 1.41 గంటలకు తుది శ్వాస విడిచారు. దీంతో మాగుంట కుటుంబంలో విషాదం నెలకొంది. దివంగత సుబ్బరామిరెడ్డికి సుధాకరరెడ్డి తోడు నీడగా ఉండే వారని ఆయన సోదరుడు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. తనకు సైతం నిత్యం తోడు నీడగా ఉన్న సుధాకరరెడ్డి ఇక లేరన్న సమాచారం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు.
అన్నయ్య సుబ్బరామిరెడ్డి దివంగతులైన తర్వాత కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారని, మంచితనానికి, మానవత్వానికి నిలువెత్తు రూపమైన సోదరుడు సుధాకర్ మరణం తమ కుటుంబానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సుధాకరరెడ్డి భౌతిక కాయాన్ని నుంగంబా క్కం కాలేజ్ రోడ్డులోని సుబ్బారావు అవెన్యూలోని స్వగృహంలో ఉంచారు. శనివారం సాయంత్రం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి.
నివాళులు
సుధాకర్‌రెడ్డి మృతికి కెన్సస్ అధినేత నర్సారెడ్డి, తెలుగు మహాజన సమాజం అధ్యక్షుడు, అమర జీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ చైర్మన్ అనిల్‌కుమార్‌రెడ్డి, ఆస్కా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అపోలో ప్రీతారెడ్డి, సత్యం థియేటర్స్ మునికన్నయ్య, నడిగర్ తిలకం శివాజీ గణేషన్ పెద్ద కుమారుడు రామ్‌కుమార్ తదితరులు నివాళులర్పించారు. తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సంతాపం తెలిపారు.
నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు (ఇన్‌సెట్) సుధాకరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment