సాక్షి, హైదరాబాద్/విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు
అంబేద్కర్ కోనసీమ జిల్లా:
శివనామ స్మరణతో కోటిపల్లి, ద్రాక్షారామ పుణ్యక్షేత్రాలు మార్మోగాయి. మహాశివరాత్రినీ పురస్కరించుకొని కోటిపల్లి ద్రాక్షారామం ఆలయాలలో క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. వేకువజామున నుంచి భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.
నంద్యాల:
మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తజనం బారులు తీరారు. వేకువజాము నుండి పాతాళగంగ స్నాన ఘట్టాల వద్ద శివ భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శ్రీశైలంలో నేడు పాగాలంకరణ, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. శివనామస్మరణతో శ్రీగిరి క్షేత్రం మార్మోగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. శ్రీశైల క్షేత్రంలో స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.
కరీంనగర్:
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధి భక్త జనసంద్రంగా మారింది. మూడు రోజుల పాటు జరుగనున్న జాతరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్న గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాల సమర్పించింది. మరో వైపు పంచాక్షరీ నామస్మరణతో రాజన్న సన్నిధి మార్మోగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment