సాక్షి, హైదరాబాద్: జననేత మీద అతనికి ఉన్న అభిమానం.. అతని చేత సరిహద్దులు దాటించింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం గుండా ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయించింది. ఇండియన్ పాలిటిక్స్‌లో కింగ్ అంటూ మనస్ఫూర్తిగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆరాధిస్తున్నాడతను. అందుకే దాదా అని పిల్చుకుంటూ ఆయన్ని కలుసుకునేందుకు సైకిల్ యాత్ర చేపట్టాడు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి.
షోలాపూర్‌కు చెందిన కాకా కాక్డే.. రైతు. సీఎం జగన్ అంటే అతనికి ఎంతో అభిమానం. అందుకే ఆయన్ని ఎలాగైనా కలవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. సైకిల్ యాత్ర చేపట్టారు. తద్వారా మీడియా దృష్టిని ఆకట్టుకున్నాడు. అంతేనా.. ఏపీ సీఎం జగన్ భవిష్యత్తులో దేశానికి ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నాడు కూడా.
కాకా కాక్డే షోలాపూర్‌లో సీఎం జగన్ పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ స్థాపించి.. పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ జూన్-జులై మధ్య షోలాపూర్‌లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని అనుకుంటున్నాడట. వీలైతే సీఎం జగన్‌ను ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని భావిస్తున్నాడతను.
ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారంటే.. సీఎం జగన్‌ను తాను దేవుడిగా భావిస్తానని, దేవుడి నుంచి ఏం ఆశిస్తామని, కేవలం ఆయన్ని కలిసి రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం దక్కినా చాలని అంటున్నాడు కాకా కాక్డే. షోలాపూర్ నుంచి 800 కిలోమీటర్లు ప్రయాణిస్తేనే.. అతను ఏపీ గుంటూరు తాడేపల్లికి చేరుకోగలడు. ఎనిమిది రోజుల నుంచి పదిరోజుల ప్రయాణం లక్ష్యంగా పెట్టుకుని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment