సీతమ్మధార(అనకాపల్లి): కాంక్రీట్ జంగిల్‌లా మారుతున్న నగరంలో పచ్చని రామచిలుకలు ఒకట్రెండు కనిపించడమే చాలా అరుదు. చిలక జోస్యం చెబుతామంటూ తిరిగేవారి పంజరంలో తప్ప కనిపించని రోజుల్లో చిలుకల సామ్రాజ్యంగా మారింది ఆ ఇల్లు. ఉదయం ఆరు గంటలకు, సాయంత్రం 4 గంటలకు ఏ చిలుక ఎక్కడ ఉన్నా.. నగరంలోని భానూనగర్‌లోని ఆయన ఇంటి మేడపైకి రావాల్సిందే. రామచిలుకల కిలకిలలతో ఆ ప్రాంతమంతా ప్రకృతి నిలయంగా మారిపోతోంది.
కృష్ణాకాలేజీ సమీపంలోని భానూనగర్‌లో నివాసముంటున్న లక్ష్మీనారాయణరెడ్డి ప్రైవేట్ హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. భార్య శైలజ టీచర్‌గా పని చేస్తున్నారు. దాదాపు పదేళ్ల క్రితం లక్ష్మీనారాయణరెడ్డి మేడపైన పెంచుతున్న పూలమొక్కల వద్దకు రెండు రామచిలకలు వచ్చాయి. వాటిని చూసి ముచ్చటపడిన లక్ష్మీనారాయణరెడ్డి వాటికి గింజల్ని వేశారు. తర్వాత అవి ఒకొక్కటి పెరగసాగాయి. ఇప్పుడవి 200కిపైగా వస్తున్నాయి. ఆ ఇంటికి ఆత్మీయ అతిథులుగా మారిపోయాయి.
యాదృచ్ఛికంగా మొదలైన ఈ కుటుంబం, రామచిలుకల బంధం.. విడదీయరానిదిగా అల్లుకుపోయింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు రామచిలుకలు సవ్వడి చేస్తూ వారి మేడమీదకి వచ్చేస్తాయి. మధ్యాహ్నం 1 గంటకు పావురాల కువకువలు వినిపిస్తాయి. మళ్లీ సాయంత్రం 4 గంటలకు రామచిలుకలు అతిథుల్లా పలకరిస్తాయి. ఇది ప్రతి రోజూ దినచర్యగా మారిపోయింది. వీటి కోసం ప్రతి రోజూ దాదాపు 10 కిలోలకు పైగా బియ్యం, ఇతర ఆహార గింజలు ఆహారంగా వేస్తున్నారు. నెలకు సుమారు రూ.4 వేలకు పైగా ఖర్చవుతున్నా.. తమ కుటుంబ సభ్యుల కోసమే కదా అన్నట్లుగా ఈ భార్యభర్తలు చిలుకలను ప్రేమగా సాకుతున్నారు. 2014లో హుద్‌హుద్ ముందు వరకూ 700కి పైగా రామచిలుకలు వచ్చి సందడి చేసేవి.
హుద్‌హుద్ సమయంలో గూళ్లు దెబ్బతినడంతో చిలుకల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 300 వరకూ రామచిలుకలు, 100 వరకూ పావురాలు, గోరింకలు వస్తున్నాయనీ.. ప్రతి రోజూ వాటికి సమయానికి ఆహారం అందించడం మాకు దినచర్యగా మారిపోయిందని భార్యభర్తలు లక్ష్మీనారాయణరెడ్డి, శైలజ చెబుతున్నారు. తమ పిల్లల మాదిరిగానే రామచిలుకలను అపురూపంగా చూసుకుంటున్నామన్నారు. చిలుకల పందిరిలా మారిపోయిన ఈ మేడను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు రామచిలుకలు వచ్చే సమయం కోసం ప్రతి రోజూ ఎదురు చూస్తుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment