ఎయిమ్స్ ఆస్పత్రి
మంగళగిరి: రాష్ట్ర ప్రజలందరి సౌకర్యార్థం గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఆస్పత్రి మొబైల్ యాప్ ద్వారా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఈ–పరామర్శ’ యాప్‌ను ఉపయోగించి.. ప్రజలు తమకు అవసరమైన వైద్య సేవలను ఇక సులభంగా పొందవచ్చు. నేరుగా ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకునే వారితో పాటు టెలీమెడిసన్ ద్వారా వైద్య సేవలు అవసరమైనవారికి ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆస్పత్రి అధికారులు చెప్పారు. దీనివల్ల రోగులకు సమయంతో పాటు ఖర్చు కూడా ఆదా అవుతుందని చెప్పారు.
మొబైల్ ఫోన్‌లోని గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘ఎయిమ్స్ మంగళగిరి ఈ–పరామర్శ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి.. రోగి తన వివరాలు నమోదు చేసుకోవచ్చు. అందులోని టెలీకన్సెల్టెన్సీ ద్వారా జనరల్ మెడిసన్, దంత, నేత్ర, ఎముకల వైద్యంతో పాటు 12 రకాల వైద్య సేవలను పొందవచ్చు. అవసరమైన విభాగంలో వివరాలు నమోదు చేసి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.
సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు, శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు వైద్యులు అందుబాటులోకి వచ్చి చికిత్సకు సంబంధించిన సలహాలిస్తారు. నేరుగా ఎయిమ్స్‌కు వెళ్లి ఓపీలో రూ.10 చెల్లించి చికిత్స తీసుకున్న వారు.. తమ రిపోర్టులను యాప్‌లో తెలుసుకునే అవకాశముంది. యాప్ ద్వారానే రోగులు తమ ఆరోగ్య సమస్యలను డాక్టర్లకు వివరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment