
ఈనాడు రామోజీరావు అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి పునాది అయిన ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ చేతులు ఎత్తేసిందా? చిట్టీల కాల పరిమితి తీరినప్పటికీ చందాదారులకు డబ్బులు చెల్లించడం లేదా? చెల్లించాల్సిన మొత్తాన్ని డిపాజిట్‌గా స్వీకరించి పబ్బం గడుపుతోందా? చాలా ఊళ్లలో చందాదారులు డబ్బుల కోసం మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారా? వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆ సంస్థ మేనేజర్లు ముఖం చాటేస్తున్నారా? కొందరికి మాత్రమే చెల్లింపులు చేస్తున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వినిపిస్తోంది.
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ చందాదారుల సొమ్మును రామోజీరావు అక్రమంగా తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో ఆ సంస్థ ఒట్టిపోయింది. చిట్టీలు పాడిన చందాదారులకు ప్రైజ్ మనీ చెల్లించలేక ముఖం చాటేస్తోంది. రాష్ట్రంలోని 37 బ్రాంచిల పరిధిలో వేలాది మంది చందాదారులకు చిట్టీల మొత్తం బకాయి పడింది. దాంతోపాటు అక్రమ డిపాజిట్ల కాల పరిమితి ముగిసినప్పటికీ చెల్లించకపోవడం గమనార్హం.
మొత్తంగా కనీసం రూ.2 వేల కోట్లకుపైగా బకాయిలు పడటంతో మార్గదర్శి దుకాణం మూత పడే పరిస్థితికి వచ్చింది. స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారులు రాష్ట్రంలోని 37 మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో వరుసగా రెండో రోజు శుక్రవారం కూడా నిర్వహిస్తున్న సోదాల్లో ఆ సంస్థ అక్రమాలు భారీగా బయట పడుతున్నాయి. తద్వారా ఈ సంస్థ ఏ క్షణంలో అయినా పేలిపోయే నీటి బుడగ అని స్పష్టమవుతోంది.
దివాలా అంచుకు మార్గదర్శి
చందాదారుల సొమ్మును రామోజీరావు కుటుంబం తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆర్థికంగా దివాలా అంచులకు చేరుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై సీఐడీ కేసు నమోదు చేయడంతో రాష్ట్రంలో 2022 నవంబర్ నుంచి కొత్త చిట్టీ గ్రూపులు నిలిచిపోయాయి. చందాదారుల సొమ్మును మార్గదర్శి చిట్‌ఫండ్స్ చట్టానికి విరుద్ధంగా అక్రమంగా మళ్లిస్తోందన్నది స్పష్టమవడంతో కొత్తగా చిట్టీలు వేసేందుకు చందాదారులు ముందుకు రావడం లేదు.
దాంతో మనీ సర్క్యులేషన్ (గొలుసుకట్టు మోసాలు) తరహాలో వ్యాపారం నిర్వహిస్తున్న రామోజీరావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. నిధుల రొటేషన్ నిలిచి పోవడంతో పాత చిట్టీల చందాదారులకు చిట్టీ పాటల మొత్తం (ప్రైజ్ మనీ) చెల్లించడం తలకు మించిన భారంగా పరిణమించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ రాష్ట్రంలో దాదాపు 9 నెలలుగా తమ చందాదారులకు ప్రైజ్‌మనీ సక్రమంగా చెల్లించలేకపోతోందని స్టాంపులు– రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారుల సోదాల్లో వెల్లడైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు 37 బ్రాంచీలు ఉన్నాయి. బ్రాంచికి సగటున 35 మంది చొప్పున చందాదారులకు చిట్టీల మొత్తం బకాయి పడింది. అంటే దాదాపు 1,300 మంది చందాదారులకు 9 నెలలుగా ప్రైజ్ మనీ చెల్లించడం లేదు. నెలకు రూ.260 కోట్ల టర్నోవర్ ఉండే మార్గదర్శి.. అందులో రూ.80 కోట్లు డివిడెండ్లుగా చెల్లించాల్సి ఉండగా.. రూ.180 కోట్ల వరకు చిట్టీ పాటల ప్రైజ్ మనీగా ఇవ్వాల్సి ఉంది. 2022 నవంబర్ నుంచి ఆ ప్రైజ్ మనీ మొత్తం సక్రమంగా చెల్లించక పోవడంతో బకాయిలు పేరుకుపోయాయి.
ఆ ప్రకారం 9 నెలలకు రూ.1,620 కోట్ల వరకు బాకాయిలు పేరుకుపోయాయని సీఐడీ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. 2022 నవంబర్‌కు ముందు చిట్టీలు పాడిన చందాదారులకు పూర్తిగా ప్రైజ్ మనీ చెల్లించకుండా రశీదు రూపంలో అక్రమంగా డిపాజిట్లు సేకరించింది. 4 శాతం నుంచి 5 శాతం వడ్డీ చొప్పున ఆరు నెలల నుంచి రెండేళ్ల కాల పరిమితితో అక్రమ డిపాజిట్లు సేకరించింది.
కాల పరిమితి ముగిసిన ఆ రశీదు డిపాజిట్లను కూడా మార్గదర్శి చిట్‌ఫండ్స్ 9 నెలలుగా చెల్లించలేకపోతోంది. ఈ బకాయిలు కూడా కలిపి మొత్తంగా దాదాపు రూ.2 వేల కోట్ల వరకు మార్గదర్శి చిట్ ఫండ్స్ బకాయి పడినట్టు సీఐడీ అధికారుల సోదాల్లో వెలుగు చూసినట్టు విశ్వసనీయ వర్గాల సమచారం.
ఏమండీ.. డబ్బులెప్పుడిస్తారు?
9 నెలలుగా చిట్టీ పాటల మొత్తం చెల్లించకపోవడంతో పెద్ద సంఖ్యలో చందాదారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారితోపాటు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రశీదు రూపంలో డిపాజిట్లు చేసిన వారు కూడా తమ సొమ్ము కోసం ప్రాధేయపడుతున్నారు. ‘ఏమండీ.. మీ ఇబ్బందులతో మాకు సంబంధం లేదు.
మా డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పండి. మీరు తప్పులు చేయబట్టే మాకీ ఇబ్బందులు’ అంటూ బాధితులు నిలదీస్తున్నారు. నిబంధనల ప్రకారం మూడు ష్యూరిటీలు చూపించినా.. వారు ప్రభుత్వ ఉద్యోగులు అయినా సరే ఏవేవో కొర్రీలు వేస్తూ డబ్బులు ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారు. అక్కడక్కడ ఒత్తిడి తెస్తున్న ఒక సామాజికవర్గం వారికి మాత్రం చిట్టీల మొత్తం చెల్లిస్తున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్లు, సీఐడీ అధికారుల పరిశీలనలో వెల్లడైంది.
ఇది నిధుల మళ్లింపు పాపం
కేంద్ర చిట్ ఫండ్స్ చట్టం–1982 ప్రకారం చందాదారుల సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టకూడదు. చందాదారులు చెల్లించే చిట్టీ సొమ్మును సంబంధిత బ్రాంచి పరిధిలోని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలి. చిట్ ఫండ్స్ సంస్థ ఏ కారణంతోనైనా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే చందాదారులు నష్టపోకుండా ఆ నిబంధనలు విధించారు. ఎందుకంటే అక్రమంగా పెట్టిన పెట్టుబడులు వెంటనే వెనక్కి తేవడం సాధ్యం కాదు. కానీ ఈ రెండు నిబంధనలను రామోజీరావు ఏనాడూ పట్టించుకోలేదు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ చందాదారులు చెల్లించిన సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో తమ కుటుంబ సభ్యుల పేరిట పెట్టుబడిగా పెట్టారు. దాంతోపాటు తమ కుటుంబ సంస్థలైన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇతర రాష్ట్రాల్లోనూ అలజడి
ఈ నేపథ్యంలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచిల నుంచి నిధులను ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాంచిలకు మళ్లించాలని ఆ సంస్థ భావించినట్టు సమాచారం. కాగా ఆంధ్రప్రదేశ్‌లో చందాదారులను ముంచేసినట్టుగానే తమ నిధులను కూడా అక్రమంగా మళ్లిస్తారేమోనని ఆ రాష్ట్రాల్లోని చందాదారులు ఆందోళన చెందుతున్నారు.
వారు ఆ రాష్ట్రాల్లోని బ్రాంచి మేనేజర్లను తరచూ సంప్రదిస్తూ తమ చిట్టీ పాటల మొత్తం వెంటనే చెల్లించాలని స్పష్టం చేస్తున్నారు. ఏమాత్రం ఆలస్యమైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసు కేసులు నమోదైతే తట్టుకోలేమని మార్గదర్శి యాజమాన్యం బెంబేలెత్తుతోంది. మొత్తంగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు అన్ని దారులు మూసుకుపోయి ఆర్థికంగా అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయిందని చెప్పవచ్చు.
50 వేల మంది పరిస్థితి ఏమిటి?
రాష్ట్రంలోని 37 బ్రాంచిల పరిధిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు 2022 నవంబర్ నాటికి దాదాపు లక్ష మంది చందాదారులు ఉండేవారు. మార్గదర్శి అక్రమాలు బయట పడటంతో ఆ తర్వాత కొత్త చిట్టీలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో 20 వేల మంది కొత్త చందాదారులు నిలిచిపోయారు. పాత చందాదారులు లక్ష మందిలో దాదాపు 50 వేల మందికి సంబంధించిన చిట్టీల కాల పరిమితి ముగిసింది. మిగిలిన 50 వేల మంది చందాదారుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
డిఫాల్ట్ ముసుగులో దందా
డిపాల్ట్ చందాదారుల ముసుగులో మార్గదర్శి చిట్ ఫండ్స్ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారుల సోదాల్లో బయటపడింది. ఒక చందాదారుడు ఒక నెల చందా చెల్లించాక 8 నెలలు చందాలు చెల్లించకపోతే ఆయన/ఆమె డిఫాల్టర్ అవుతారు. అటువంటి డిఫాల్ట్ చందాదారులను చిట్టీ పాటకు అనుమతించకూడదు. కానీ 9 నెలల తర్వాత ఆ డిఫాల్ట్ చందాదారుని నుంచి బకాయి పడిన 8 నెలల చందాలకు చెక్కులు తీసుకున్నట్టుగా చూపిస్తున్నారు.
ఆ చందాదారుని చిట్టీ పాటకు అనుమతిస్తున్నారు. ఆ చిట్టీ పాట ఆ చందాదారునికే వచ్చేట్టుగా చేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే... అసలు అక్కడ డిఫాల్ట్ చందాదారుని పేరిట మార్గదర్శి చిట్‌ఫండ్సే ఈ దందా నడుపుతోంది. ఎందుకంటే ఆ చందాదారు ఇచ్చినట్టు చూపిస్తున్న చెక్కులను ఎన్‌క్యాష్‌మెంట్ కోసం బ్యాంకులో జమ చేయడం లేదు.
అంటే చెక్కులు ఇచ్చినట్టు చూపడం.. చిట్టీ పాటకు అనుమతించడం అంతా బోగస్ అని సీఐడీ సోదాల్లో వెల్లడైంది. ఆ ముసుగులో నల్లధనాన్ని భారీగా చలామణిలోకి తీసుకువస్తున్నారన్నది స్పష్టమైంది. మరోవైపు డిఫాల్ట్ చందాదారులను అనుమతించడంతో సక్రమంగా చందాలు చెల్లించే చందాదారులు డివిడెండ్ నష్టపోతున్నారు.
సర్కారు ‘అటాచ్‌మెంట్’ నిర్ణయం
అగ్రిగోల్డ్ సంస్థ తరహాలో చందాదారులకు సొమ్ము చెల్లించలేక మార్గదర్శి చిట్ ఫండ్స్ చేతులెత్తేస్తే.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. ఇందులో భాగంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమంగా పెట్టిన పెట్టుబడులను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది.
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన రూ.1,035 కోట్లతోపాటు రామోజీరావు కుటుంబ సంస్థలైన ఉషా కిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.50 శాతం వాటా, ఉషోదయ ఎంటర్ ప్రైజస్‌లో 44.50 శాతం వాటాను అటాచ్ చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దాంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక పరిస్థితి కుదేలైందన్న విషయం వ్యాపార, పారిశ్రామికవర్గాలకు స్పష్టమైంది. ఇతర వ్యాపార సంస్థల నుంచి గుట్టుచప్పుడు కాకుండా నిధులు సేకరిద్దామన్న రామోజీ వ్యూహం బెడిసి కొట్టినట్టు సమాచారం.
కీలక పత్రాలు స్వాధీనం
మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో సీఐడీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. లెడ్జర్లు, తేదీలు లేకుండా పెద్ద సంఖ్యలో చెక్కులు, నిధుల మళ్లింపునకు సంబంధించిన ఆధారాలు, చందాదారుల బకాయిలకు సంబంధించిన పత్రాలు మొదలైనవి స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment