పొగాకు రైతుకు మార్క్‌ఫెడ్‌ అండ | Markfed Support for Tobacco Farmer | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుకు మార్క్‌ఫెడ్‌ అండ

Published Sat, Aug 8 2020 5:17 AM | Last Updated on Sat, Aug 8 2020 5:17 AM

Markfed Support for Tobacco Farmer - Sakshi

పొగాకు రైతులు ఈ ఏడాది కష్టాల నుంచి గట్టెక్కారు. వ్యాపారుల, తయారీదారుల, ఎగుమతిదారుల కబంధ హస్తాల నుంచి పొగాకు రైతును ఒడ్డున పడేసిన సంవత్సరంగా ఈ ఏడాది నిలవబోతోంది. వేలంలో ఈ మూడు రకాల వ్యాపారులు పొగాకు రైతును కీలుబొమ్మలాగా ఆడుకున్నారు. వ్యాపారులు వాళ్ల ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తే నోరెత్తలేని దీనస్థితిలో ఇప్పటి వరకు రైతు మగ్గిపోయాడు. అయితే ఆ చీకటి రోజులకు చరమగీతం పాడుతూ, రైతులను నష్టాలపాలు చేస్తున్న వ్యాపారులకు చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లలో వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. అంతే పొగాకు రైతులకు ఊహకు కూడా అందని విధంగా ప్రయోజనం చేకూరుతోంది. పొగాకు రైతు మోములో చిరునవ్వు చిగురించింది. 

ఒంగోలు సబర్బన్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో పొగాకు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఏనాడు రాలేదు. 1976లో భారత ప్రభుత్వం వాణిజ్య పంట అయిన పొగాకు కోసం పొగాకు బోర్డును ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఎన్నో పోరాటాలు, పొగాకు రైతుల త్యాగాలు, ప్రాణదానాల ఫలితంగా 1984లో పొగాకు బోర్డు ఆధ్వర్యంలో పొగాకు వేలం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా పొగాకు రైతు ప్రతి సంవత్సరం నష్టాలతోనే సహ జీవనం చేస్తూ వస్తున్నాడు. ఆ నష్టాల నుంచి పొగాకు రైతును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బయటపడేశారు. ప్రకాశం, నెల్లూరు రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 24,153 పొగాకు బ్యారన్లు ఉండగా వాటిలో ఎస్‌బీఎస్‌ పరిధిలో 12,633, ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 11,520 బ్యారన్ల కింద పొగాకును సాగు చేస్తున్నారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో కలిపి రైతులు 30,811 మంది ఉన్నారు. వారిలో ఎస్‌బీఎస్‌ పరిధిలో 14,559 మంది రైతులు, ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలో 16,252 మంది పొగాకు సాగు చేస్తున్నారు.

51 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు..
మార్క్‌ఫెడ్‌ సంస్థ వేలంలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. అందులో దాదాపు 90 శాతానికి పైగా పొగాకు ఒక్క లో గ్రేడ్‌ పొగాకు కావటం విశేషం. దీంతో ప్రకాశం జిల్లాతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 12 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల్లో (ఎస్‌బీఎస్‌) ఆరు, దక్షిణ ప్రాంత తేలిక పాటి నేలల్లో (ఎస్‌ఎల్‌ఎస్‌) మరో ఆరు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఎస్‌బీఎస్‌ పరిధిలోని రైతుల వద్ద  రూ.36 కోట్ల విలువైన పొగాకు, ఎస్‌ఎల్‌ఎస్‌ పరిధిలోని రైతుల వద్ద రూ.15 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. 

లో గ్రేడ్‌ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా..
పొగాకు వ్యాపారులు రైతులు పండించిన పొగాకులో లో గ్రేడ్‌ పొగాకు అధికంగా ఉత్పత్తి అవుతోంది. అయితే వ్యాపారులు లో గ్రేడ్‌ పొగాకును అతి తక్కువ ధరకు కొనుగోలు చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి లో గ్రేడ్‌ పొగాకు కొనుగోలు లక్ష్యంగా మార్క్‌ఫెడ్‌ను వేలం ప్రక్రియలోకి దించారు. దీంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు 58 వేల పొగాకు బేళ్లు రైతుల వద్ద నుంచి మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగి సరిగ్గా ఆగస్టు 7వ తేదీతో 30 రోజులు అయింది. 

నాణ్యమైనది అత్యధికంగా కిలో రూ.208 
పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.208 పలికిన సందర్భాలే లేవు. అత్యధికంగా ధర పలికింది ఈ సంవత్సరమే. అదీ కూడా మార్క్‌ఫెడ్‌ పొగాకు వేలంలోకి రావటం వల్లనే సాధ్యమైంది. లో గ్రేడ్‌ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా మార్క్‌ఫెడ్‌ రంగంలోకి దిగినప్పటికీ నాణ్యమైన పొగాకును కూడా కొనుగోలు చేయటానికి మార్క్‌ఫెడ్‌ అధికారులు నిర్ణయించారు. దీంతో పేరెన్నికగన్న పొగాకు వ్యాపారులతో మార్క్‌ఫెడ్‌ పోటీ పెంచింది. దీంతో నాణ్యమైన పొగాకును వ్యాపారులు అత్యధిక ధర కిలోకు రూ.208 చెల్లించి కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. 

పోటీ వలన మేలిమి పొగాకుకు పలికిన అత్యధిక ధర కిలో: రూ.208  
గతంలో గరిష్టంగా నాణ్యమైన 
పొగాకు ధర: రూ.202 
ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన బేళ్లు:  58 వేల పొగాకు బేళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement