
విశాఖలోని హెచ్‌పీసీఎల్‌లో ఎగిసిపడుతున్న మంటలు
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు రూరల్: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) రిఫైనరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో రిఫైనరీలోని పాత యూనిట్‌లో ట్యాంకర్ నుంచి అర కిలోమీటరు దూరంలో ఉన్న ముడిచమురు శుద్ధి ప్లాంట్ (సీడీ–3 ప్లాంట్)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీప ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన హెచ్‌పీసీఎల్ అధికారులు.. సిబ్బందిని హుటాహుటిన బయటికి తరలించారు. అగ్నిమాపక కేంద్రాలకు సమాచారం అందించారు. ప్రమాదం జరిగినప్పుడు సీడీ–3 యూనిట్‌లో మేనేజర్‌తో పాటు నలుగురు సిబ్బంది పనిచేస్తున్నారు. వీరి సమాచారంతో హెచ్‌పీసీఎల్ ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ముడిచమురు శుద్ధిచేసే క్రమంలో కొంత పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు కూడా ఉండటంతో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. బ్లోయర్ నుంచి రెండుసార్లు పేలుడు శబ్దాలు వినిపించాయి. 8 అగ్నిమాపక శకటాలతో పాటు, నేవల్ డాక్‌యార్డు విశాఖపట్నం బృందాలు, హెచ్‌పీసీఎల్ ఫైర్ సేఫ్టీ సిబ్బంది కలిసి గంటన్నరపాటు శ్రమించి సాయంత్రం 4.30 గంటలకు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు.
తక్షణమే స్పందించిన ప్రభుత్వ యంత్రాంగం
హెచ్‌పీసీఎల్‌లో అగ్నిప్రమాదం విషయం తెలిసిన వెంటనే పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తదితరులు హుటాహుటిన హెచ్‌పీసీఎల్‌కు చేరుకున్నారు. పోలీసులు, నౌకాదళ బృందాలు, హెచ్‌పీసీఎల్ అధికారులు.. వందలాదిమంది కార్మికుల్ని బయటికి పంపించే ఏర్పాట్లు చేశారు. ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని కలెక్టర్ వినయ్‌చంద్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలవ్వలేదని, ఎలాంటి ప్రాణనష్టం లేదని హెచ్‌పీసీఎల్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ప్రమాదంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆరా తీశారు.
అత్యాధునిక ఏర్పాట్లతో తగ్గిన ప్రమాదతీవ్రత
1997 సెప్టెంబర్‌లో హెచ్‌పీసీఎల్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) పైప్‌లైన్‌లో లీకేజ్ ఏర్పడటంతో 6 స్టోరేజ్ ట్యాంకర్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 2013లో జరిగిన ప్రమాదంలోను పలువురు మృతిచెందారు. ఈ రెండు ప్రమాదాలు సంభవించిన తర్వాత హెచ్‌పీసీఎల్ యాజమాన్యం క్రూడాయిల్, రిఫైనరీ ఆయిల్, గ్యాస్ నిల్వలకు సంబంధించి అత్యాధునిక నియంత్రణ ఏర్పాట్లు చేసింది. ఏ ప్రమాదం సంభవించినా ఆ ట్యాంకర్‌కే పరిమితమయ్యేలా వాల్వ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. ఈ ముందస్తు చర్యల కారణంగానే ప్రస్తుత ప్రమాద తీవ్రత పూర్తిగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తం మూడు యూనిట్లోను భారీస్థాయిలో ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఇతర చమురు పదార్థాలు ఉన్నాయి. చివరి యూనిట్‌లో ప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆ యూనిట్‌కి సంబంధించిన మొత్తం వాల్వ్‌లను మూసివేశారు. దీంతో మంటలు మరో యూనిట్‌కు వ్యాపించకుండా నిలిచిపోయాయి. యూనిట్‌లో ఉన్న క్రూడాయిల్ మంటల్ని దావానలంలా వ్యాపింపజేసింది. విపత్తు నిర్వహణ బృందాలు మంటల్ని అదుపులోకి తేవడంతో స్థానికులు, ఉద్యోగులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment