పట్టణ ప్రాంతాల్లో విస్తరిస్తున్న హైజెనిక్ చికెన్, మటన్, ఫిష్ మార్టులు
పెద్ద ఎత్తున పెట్టుబడులుపెడుతున్న ఔత్సాహికులు
అంతర్జాతీయ ప్రమాణాలతోమాంసాహార మార్టులు
అందుబాటులోకి తాజా,ఫ్రోజెన్ మాంస ఉత్పత్తులు
ప్రధాన పట్టణాలు, నగరాల్లో విస్తరిస్తున్న నయా బిజినెస్ ట్రెండ్
ఆహారం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ప్రజల అభిరుచికి తగ్గట్లే వ్యాపారస్తులు కూడా అధునాతన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లో సంతలు సూపర్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక మాంసం దుకాణాలు కూడా నీట్‌గా మారుతున్నాయి. బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి నీట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారు.
అలాంటి మాంసాహార ఉత్పత్తులు కొనడానికే ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాంసాహార ఉత్పత్తులను కొన్ని సంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటికి దీటుగా పట్టణ ప్రాంతాల్లో తాజా, ఫ్రోజెన్ ఉత్పత్తులు అందించడానికి నాన్ వెజ్ స్టోర్స్, మార్ట్‌ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. – సాక్షి, అమరావతి
మీట్ మార్ట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఔత్సాహికులు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు నేరుగా మార్టులు నడుపుతుంటే.. మరి కొందరు ఫ్రాంచైజీ తరహాలో ఈ మార్ట్లను విస్తరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ముందుకొస్తున్నారు. కేవలం చేపలు, కోడి, మేక మాంసాలకే పరిమితం కాకుండా అన్ని రకాల మాంసాహార ఉత్పత్తులు ఒకే చోట అందిస్తున్నారు.
ప్రస్తుతం ఈ తరహా మార్ట్‌లు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 50కు పైగా ఉన్నాయి. ఈ మార్టుల ద్వారా రాష్ట్రంలో రోజుకు సగటున ఐదారు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగు తోందని అంచనా వేస్తున్నారు. ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాలే లక్ష్యంగా మార్టుల యజమానులు షాప్స్ ఓపెన్ చేస్తు న్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో ఇవి బాగా విస్తరిస్తున్నాయి.
మీట్ మార్టుల ప్రత్యేకతలు ఇవే..
» కబేళాలతో పాటు డ్రెస్సింగ్, ప్యాకింగ్ ఇలా ప్రతీ దాంట్ అంతర్జాతీయ ప్రమాణాలు
» పరిసరాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్
» వచ్చే ప్రతీ కస్టమర్ కళ్లెదుటే వారికి కావాల్సినట్టుగా కట్ చేసి ప్యాకింగ్
» మటన్, చికెన్, ఫిష్ తదితరాలకు ఏ పార్ట్ (భాగం) కావాలంటే ఆ పార్టులు వేరుగా విక్రయం
» బిర్యానీ, తందూరీ వంటి వంటకాలకు తగినట్టుగా కట్ చేసి ప్యాకింగ్
» రెడీ టూ కుక్‌కు వీలుగా మసాలాలు అద్ది మరీ అందించడండోర్ డెలివరీకి ప్రత్యేకంగా కాల్ సెంటర్
» రాష్ట్రంలో మీట్ మార్టులు 50
» రోజుకు సగటున జరుగుతున్న వ్యాపారం (రూ. కోట్లలో) 5- 6
» ఒక్కో మీట్ మార్టుకు పెట్టుబడి (రూ.ల్లో) 30 - 50 లక్షల వరకు
శుచి, శుభ్రత ముఖ్యం
శుచి, శుభ్రత ఉంటే కాస్త ధర ఎక్కువైనా వెనుకాడడం లేదు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఫిష్, మటన్ మార్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. బ్రతికున్న చేపలే కాదు.. శుభ్రమైన వాతావరణంలో కోడి, మేక మాంసంతో పాటు తాజాగా బతికి ఉన్న అన్ని రకాల రొయ్యలు ఈ మార్టుల్లో దొరుకుతున్నాయి. –ఎం.హరినాథ్, రిటైర్డ్ డీఈ, పంటకాలవ రోడ్, విజయవాడ
ప్రజల్లో ఆదరణ బాగుంది
గత కొన్నేళ్లుగా మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. రెండేళ్ల క్రితం ఈ రంగంలోకి అడుగు పెట్టా. తొలుత విశాఖలో ది హైపర్ మీటన్ స్టోర్ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం విశాఖలో నాలుగు, కాకినాడ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఒక్కో మార్ట్‌కు రూ. 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 50 మందికి ఉపాధి కల్పించా. నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఆదరణ బాగానే ఉంది. ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు కూడా అవకాశం ఉంది. డోర్ డెలివరీ చేస్తున్నాం. భవిష్యత్‌లో మిగిలిన నగరాల్లో కూడా విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాం. – పసల పర్వేష్, ఎం.డీ, హైపర్ మీటన్ స్టోర్
Comments
Please login to add a commentAdd a comment