మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, చిత్రంలో ఎంపీ గురుమూర్తి, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా రాష్ట్రంలో స్థూల ఉత్పత్తి, తలసరి ఆదాయం పెంచేదిశగా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో విస్తృత ఉద్యోగాల కల్పన కోసం.. అభివృద్ధి వికేంద్రీకరణ మేరకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఏర్పాటుచేస్తున్న ఈ మెగా జాబ్‌మేళాల ద్వారా 25 వేలమందికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు.
చదవండి: అన్నదాతల ‘ఆత్మ’ సాక్షిగా రాజకీయం!
శని, ఆదివారాల్లో (16, 17 తేదీల్లో) తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా యువత కోసం వైఎస్సార్‌సీపీ జాతీయ, అంతర్జాతీయంగా పేరుగాంచిన 147 కంపెనీలను పిలిపించి జాబ్‌మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ మేళా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా 1.47 లక్షల మంది పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పారు.
శని, ఆదివారాల్లో తిరుపతిలోను, 23, 24 తేదీల్లో విశాఖ ఆ«ం«ధ్ర యూనివర్సిటీలో, ఈనెల 30, మే 1వ తేదీ గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఈమేళాలు నిర్వహిస్తున్నట్టు వివరించారు. శనివారం తిరుపతి, వైఎస్సార్, రాజంపేట, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన వారు, ఆదివారం అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల వారు ఈమేళాలో పాల్గొనాలని సూచించారు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ అయి కన్ఫర్మేషన్ లెటర్ వచ్చినవారు మాత్రమే హాజరుకావాలన్నారు. తిరుపతిలో నిర్వహించే జాబ్‌మేళాకు 40 వేలమందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు.
మూడేళ్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 6 లక్షలకుపైగా ఉద్యోగాలు
ఉద్యోగాల కల్పనలో ఏపీ ముందంజలో ఉందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 35 నెలల్లోనే ఆరులక్షలకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనన్నారు. 2.50 లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారని, ఆర్టీసీలోని 52 వేలమంది ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నారని, 2.60 లక్షల వలంటీర్ల పోస్టులు ఇచ్చారని, ఆప్కోస్ ద్వారా 95 వేలమందికి ఉద్యోగాలు కల్పించారన్నారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోనూ ఉపాధి కల్పిస్తూ 75% మంది స్థానికులకే ఉద్యోగాలను అందించేందుకే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. మూడేళ్లలో 30 సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందని చెప్పారు.
బాబూ ఎప్పుడైనా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించావా?
‘చంద్రబాబు తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారుగానీ.. వాస్తవానికి 44 ఇయర్స్ ఇండస్ట్రీ. అయితే ఏం ప్రయోజనం? తాను తొమ్మిదేళ్లు సమైక్యాంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా చేసినప్పుడుగానీ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడుగానీ ఒక్కరికైనా జాబ్‌లు ఇప్పించారా.. కనీసం ఇలాంటి మేళాలు ఎప్పుడైనా నిర్వహించారా..’ అని ప్రశ్నించారు. నూతన చరిత్రకు నాంది పలికేలా వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న జాబ్ మేళాను చూసి చంద్రబాబుకి టీడీపీ నేతలకు వణుకుపుడుతోందన్నారు. వారు చేయరు, ఎవరైనా చేస్తే ఓర్చుకోలేని వింత వ్యాధితో పప్పునాయుడు, తుప్పునాయుడు బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లలో చంద్రబాబుహయాంలో కేవలం తన సామాజికవర్గానికి చెందిన అనుకూలురకే లబ్ధిచేకూర్చుకున్నారని విమర్శించారు. తాము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అర్హులైన వారందరికీ పార్టీలు, రాజకీయాలు, కులాలకతీతంగా ఎన్నో మేళ్లు చేస్తున్నామని చెప్పారు.
2024లో టీడీపీ సమాధి ఖాయం
రానున్న ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమా అని టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రశ్నించారు. ఒంటరిగా పోటీచేసినా, పొత్తులతో పోటీచేసినా 2024 ఎన్నికల్లో మళ్లీ చావు దెబ్బతిని.. టీడీపీ సమాధి కావడం ఖాయమని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్న పప్పు నాయుడు లోకేశ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నది నిజమే అయితే.. తన తండ్రి పేరుని, తాను పోటీచేసిన నియోజకవర్గం మంగళగిరినిసరిగ్గా పలికించాలని సూచించారు.
కుప్పంలో కూడా జాబ్‌మేళా పెడతాం
చంద్రబాబు అడిగితే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేశామని, ఆయన అడిగితే కుప్పంలో కూడా ఇలాంటి జాబ్‌మేళాలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బోర్డు చైర్మన్ నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment