
పాదయాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మేకపాటి రాజమోహన్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి
సాక్షి, అమరావతి/నెల్లూరు: రాజకీయ అవసరాల కోసం స్నేహాలు వర్తమాన పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అందుకు పూర్తి మినహాయింపు. స్వప్రయోజనాల కోసం ఆయన స్నేహం చేయలేదు. స్నేహం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్ని కష్టాలు ఎదురైనా స్నేహితుడి వెన్నంటి నిలిచారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన బాంధవ్యం నేటి రాజకీయాల్లో అరుదైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది.
చిన్నప్పుడే చిగురించిన స్నేహబంధం..
రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గౌతమ్‌రెడ్డి విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంపైనే దృష్టి కేంద్రీకరించారు. తొలినాళ్లలో రాజకీయ వ్యవహారాల పట్ల అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఆయన తమ్ముడు పృథ్వీరెడ్డి హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్లాస్‌మేట్ కావడంతో స్నేహబంధం ఏర్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ఆత్మీయ అనుబంధం మరిం త బలపడింది. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం టికెట్ కోసం నాడు కాంగ్రెస్ పార్టీలో తీవ్రపోటీ నెలకొనగా వైఎస్సార్ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డికే అవకాశం దక్కింది.
ఆర్థికంగా అణచివేసినా వెరవలేదు..
వైఎస్సార్ హఠాన్మరణం అనంతరం ఆయన అండదండలతో కాంగ్రెస్ నుంచి గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖం చాటేసినా కష్టకాలంలో మేకపాటి కుటుంబం వైఎస్ జగన్ వెన్నంటే నిలిచింది. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహణలో పాలు పంచుకుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచేందుకు తన ఎంపీ పదవిని త్యజించేందుకు సైతం మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెనుకాడ లేదు. వైఎస్ జగన్ వెన్నంటి నిలిచిన మేకపాటి కుటుంబాన్ని నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వేధించింది. అయినప్పటికీ గౌతమ్‌రెడ్డి వెరవక వైఎస్ కుటుంబంతోనే రాజకీయంగా ప్రయాణం కొనసాగించారు.
Comments
Please login to add a commentAdd a comment