విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత. చిత్రంలో ఎంపీ సురేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
సాక్షి, అమరావతి: రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలకు సింహ భాగం ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని వైఎస్సార్‌సీపీ నేతలు పేర్కొన్నారు. రానున్న కాలంలో రాజకీయ పదవుల్లో సైతం తమ వాటా సాధించుకునే స్థాయికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దేలా చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అన్ని పదవుల్లోనూ సగానికి పైగా మహిళలకు అవకాశం కల్పించి మహిళా సాధికారతకు అసలైన నిర్వచనం చెప్పారని కొనియాడారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు శనివారం విజయవాడ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో రాష్ట్రంలో 47 కార్పొరేషన్‌లకు 481 మంది డైరెక్టర్ల నియామక జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 27 నెలల పాలనలో.. మంత్రివర్గ కూర్పు నుంచి కార్పొరేషన్ డైరెక్టర్ల వరకు నిజాయితీ, నిబద్ధతతో సామాజిక న్యాయాన్ని అమలు చేసి చూపించారన్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు 47 కార్పొరేషన్లకు సంబంధించి 481 మంది డైరెక్టర్ల పేర్లు ప్రకటిస్తున్నామన్నారు. వీరిలో 248 మంది డైరెక్టర్ల (52 శాతం) పదవులను మహిళలకే ఇచ్చి అగ్రపీఠం వేశామని చెప్పారు. మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. పురుషులకు 233 డైరెక్టర్ల (48 శాతం) పదవులు ఇచ్చామని, మొత్తం డైరెక్టర్లలో 58 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వగా.. 42 శాతం పదవులు ఓసీలకు ఇచ్చామని వివరించారు.
వైఎస్సార్‌సీపీ హయాంలో సామాజిక న్యాయం
వైఎస్ జగన్ 2019లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని విషయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే అని, అసెంబ్లీ స్పీకర్ కూడా బీసీనే అని చెప్పారు. రేపు రాబోయే మండలి అధ్యక్షుడు కూడా ఆ వర్గానికి చెందిన వ్యక్తి ఉండే వీలుందన్నారు. ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవులు, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో చెప్పిన దానికంటే మిన్నగా ఇస్తున్నారని తెలిపారు. సచివాలయాల ఉద్యోగుల్లో 83 శాతం ఆ వర్గాలకు చెందిన వారున్నారని, ఆ వర్గాలలో ఒక విశ్వాసం పాదుకొల్పేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో, నిబద్ధతతో కృషి చేస్తోందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్ల పదవులు, 137 నామినేటెడ్ పోస్టుల్లో సగానికి పైగా పదవులు ఈ వర్గాల వారికే ఇచ్చామని చెప్పారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తే, వారిలో 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారున్నారని వివరించారు.
మాట నిలబెట్టుకున్నాం
సామాజికంగా, రాజకీయంగా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ వెతికి మరీ అభ్యర్థులను ఎంపిక చేశామని సజ్జల తెలిపారు. కొన్ని కులాల్లో అలా వెతకాల్సి వచ్చిందని, ఇందుకోసం భారీ కసరత్తు చేశామని చెప్పారు. చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామని, ప్రతి కార్పొరేషన్‌లో మహిళలకు సగానికి పైగా పదవులు ఇచ్చామన్నారు. కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు ఒక వర్గం మీడియా అనవసర రాద్ధాంతం చేసే వీలుంది కాబట్టి, అన్నీ స్పష్టంగా చెబుతున్నామని తెలిపారు. 2014–19 మధ్య టీడీపీ కేవలం మాటలే చెప్పిందని.. బీసీ, ఎస్సీలను అస్సలు పట్టించుకోలేదని విమర్శించారు. ఒక నాయకుడికైతే పదవి ఇచ్చామని చెబితే, ఆయన కారులో బయలుదేరితే, మధ్యలోనే మొండిచేయి చూపారని గుర్తు చేశారు.
ఇది బీసీల ప్రభుత్వం: మంత్రి చెల్లుబోయిన
చంద్రబాబు ఎప్పుడూ బీసీల తోకలు కత్తిరిస్తానని, తోలు తీస్తానని చులకనగా చూసేవారని.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతల్లో సామాజిక న్యాయం చూపిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సీఎంకు సామాన్యుడికి మధ్యలో ఎవరూ లేకుండా నేరుగా సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారని చెప్పారు. ఏది చేయగలమో అదే చెప్పాలని, చెప్పింది చేయాలని ఆచరించి చూపిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఈ దేశానికి ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈరోజు ఒక భరోసా లభించిందని చెప్పారు. ఈ వర్గాలకు వివిధ పథకాల ద్వారా రూ.లక్షా 40 వేల 438 కోట్ల మేర లబ్ధి కలిగిందన్నారు. ఎమ్మెల్యే మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్ కోరుకున్న పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. గొప్ప మనసున్న సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రజల కోసమే పని చేస్తారన్నారు.
సీఎం మహిళా పక్షపాతి : హోం మంత్రి సుచరిత
సీఎం జగన్ మహిళా పక్షపాతి అని డైరెక్టర్ పదవుల కేటాయింపు ద్వారా మరోసారి నిరూపించారని హోం మంత్రి సుచరిత అన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అణచివేతకు గురయ్యారని, సీఎం వైఎస్ జగన్ మాత్రం ఆ వర్గాలకు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మహిళలను రాజకీయంగా అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టడమే కాకుండా, వారు ఎదిగేలా ప్రోత్సాహిస్తున్నారన్నారు. ఇళ్ల పట్టాలు, ఇళ్ల ద్వారా మహిళల పేరు మీద ఒక తోబుట్టువులా స్థిరాస్తి కల్పిస్తున్నారని, తద్వారా మహిళా లోకం ఆయన్ను అన్నగా భావిస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment