
ఏఎన్‌యూ: రజకుల సాధికారతకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రజక ఆత్మగౌరవ మహాసభలో మంత్రి ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రజకులకు సమున్నత స్థానం కల్పించారని తెలిపారు.
అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు పేదవాడి చెంతకు చేరుతున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. రజకుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు.
సామాజిక సాధికారతకు ఏపీ వేదిక..
బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. కులగణన విషయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ ప్రక్రియ తరువాత రజకులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్నారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదికగా నిలుస్తోందని తెలిపారు. గత పాలకుల వివక్షకు గురైన వర్గాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమున్నత స్థానం కల్పిస్తోందన్నారు.
ప్రస్తుతం ఏపీలో బీసీల రాజ్యం నడుస్తోందని తెలిపారు. రజకుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. రజకులకు ఏపీ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు కల్పించనుందన్నారు. చట్టసభల్లో రజకులకు తప్పకుండా స్థానం దక్కుతుందన్నారు.
రజకులను వంచించిన చంద్రబాబు
ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. మాటతప్పే వ్యక్తిత్వం ఆయనది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రజకులను తీవ్రంగా వంచించిందన్నారు.
రజకుల్లో 50 ఏళ్ల వారికి పింఛన్ ఇవ్వమంటే మీకు ఇస్తే మిగతా కులాలు కూడా అడుగుతాయని చంద్రబాబు అవమానించారన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకుడు బండి శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘాలు, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలు..
ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలంగాణ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. రజకులపై తాను రాసిన పాట అంటే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. రాష్ట్రంలో గతానికి, ఇప్పటికి ఉన్న మంచిని గమనించాలని రజకులకు సూచించారు. పాటలతో ఆయన సభికులను ఉత్తేజపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment