సాక్షి, విజయవాడ: వారంతా రెక్కాడితే కానీ డొక్కాడని కష్ట జీవులు.. చేతి వృత్తుల్లో నిష్ణాతులు. వారి చేతిలో అందమైన డైనింగ్ టేబుల్స్, షోకేసులు, బీరువాలు, భవనాలు, స్వర్ణాభరణాలు అపురూపంగా తయారవుతుంటాయి. అయితే మహమ్మారి కరోనా వారీ జీవితాలను ఛిద్రం చేసింది. లాక్‌డౌన్ మొదట్లో బతుకు జీవుడా అంటూ సొంతూరు బాట పట్టిన వీరు ఇప్పుడు ఆర్థిక, ఆకలి బాధతో తిరిగి నగరానికి వలస వస్తున్నారు.
స్వస్థలాల నుంచి తిరుగుముఖం..
ఉత్తరప్రదేశ్, బీహర్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్, పశ్చిమబంగా, ఒడిశా తదితర ప్రాంతాల నగరానికి పలువురు కూలీలు వలస వస్తున్నారు. వీరు ఫర్నీచర్, స్వర్ణాభారణాలు, నిర్మాణ రంగంల్లోనూ పనులు చేస్తుంటారు. ముఖ్యంగా యువకులు అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి పనులు చేసుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుని తమ తమ ప్రాంతాల్లోని పండుగలకు వెళ్తూ ఉంటారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు.
ఉపాధి, ఆదాయం లేక ఇబ్బంది..
తమ సొంత వారిని కలిశామని తృప్తి అయితే ఉంది కాని అక్కడ పనులు చేసుకుందామంటే తగినంత ఉండక.. కుటుంబ పోషణ కష్టమై ఇబ్బందులు పడ్డామని పలువురు కూలీలు చెబుతున్నారు. దీంతో తిరిగి ఇక్కడకు వచ్చేయడమే మంచిదని అందరం కలిసి ఇక్కడికి వచ్చేశామని చెబుతున్నారు.
యజమానులు ప్రోత్సాహం..
గతంలో తమ వద్ద పనిచేసే చేతి వృత్తుల వారు స్వస్థలాలకు వెళ్లిన తర్వాత ఇక్కడ వ్యాపారాలు బాగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో పనులు ఆగిపోకూడదని, వెళ్లిన కూలీలను వెనక్కు రమ్మని యజమానులు ప్రోత్సహిస్తున్నారు. అవసరమైతే కొంత ఆర్థిక సహాయం అడ్వాన్స్‌గా అందిస్తున్నారు. దీంతో తమ పాత పనులు ఉన్నాయని తెలుసుకుని వెనక్కు వచ్చేస్తున్నారు. ఇలా నగరంలో సుమారు 40శాతం మంది కూలీలు వెనక్కు వచ్చి ఉండవచ్చని షాపు ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు చెబుతున్నారు.
కరోనా జాగ్రత్తలతో పనులు
వెనక్కు వచ్చిన వలస కూలీలు కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరం దూరం కూర్చుని పనిచేస్తున్నారు, మాస్క్‌లు, శానిటైజర్లు వాడుతూ, వేడివేడి భోజనం తినడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment