దర్యాప్తు సంస్థలకు సహకరించి మీరు మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. మీరు దర్యాప్తు సంస్థలను నమ్మడం లేదు..మేం మిమ్మల్ని నమ్మడం లేదు. మీరు ఈ విధంగా సభ్య సమాజాన్ని రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలి. అమాయక జనాన్ని రెచ్చగొట్టి, లాఅండ్ ఆర్డర్ కు సమస్య తెచ్చే విధంగా ప్రవర్తించడం తగదు. ప్రజాధనం దుర్వినియోగం అయింది అంటే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో మైలేజీ వస్తుందని నేను అనుకోను.
అరెస్టుతో తెలుగుదేశం పార్టీకి మైలేజీ వస్తుందని అనుకుంటే ఏం చేయలేం. వాస్తవాలు అన్నవి ప్రజలకు తెలియాల్సి ఉంది. అవి తెలిశాక జ్యుడీషియరీ ముందు ఎవరికి వారు నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అప్పుడే ఎవరి సచ్ఛీలత ఎంతన్నది తేటతెల్లం అవుతుంది అని మంత్రి ధర్మాన అన్నారు.
తాడేపల్లి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడు నారా చంద్రబాబును అరెస్టు సుహాసిని ఏపీసీఐడీ ఆదివారం ఆయనను కోర్టులో హాజరుపర్చింది. ఈ సందర్బంగా ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ బాధ్యతాయుతమైన ప్రజా ప్రతినిధిగా చంద్రబాబు దర్యాప్తు సంస్థలకు సహకరించాలని అన్నారు. చంద్రబాబు అరెస్టుపై మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
అరెస్టే చేయకూడదు అని వాదిస్తే ఎట్లా ?
ఇదేదో నిన్న అనుకుని ఈరోజు చేసిన అరెస్టు కాదు. ఈ కేసులో రెండేళ్ల కిందటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాక కొన్ని పేర్లు వస్తాయి. దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇంకొన్ని పేర్లు కూడా వీటికి అదనంగా వచ్చి కలుస్తాయి. ఈ కేసులో 37వ ముద్దాయిగా చంద్రబాబు నాయుడు పేరును చేర్చి, కోర్టు ముందు హాజరుపరిచారు. అసలు చంద్రబాబు నాయుడును అరెస్టే చేయకూడదు అని ఎవ్వరైనా వాదిస్తే అది ఎంత మాత్రం సబబు కాదు. రాజకీయ పార్టీలకు చెందిన వారు కానీ పౌరులు కానీ అరెస్టే చేయకూడదు అని వాదిస్తే ఎట్లా ?.
మన వ్యవస్థలో,మన రాజ్యాంగ వ్యవస్థలో ఎవరికైనా మినహాయింపు ఉంటుందా? తప్పనిసరిగా అందరూ చట్టం ముందు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అందుకే దర్యాప్తు సంస్థ అరెస్టు చేస్తుందే తప్ప అరెస్టుకు సంబంధించి కారణాలను ముద్దాయితో సహా కోర్టు ముందు ఉంచుతుంది. అరెస్టు సక్రమమా ? అక్రమమా ? అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. ఎవరికైనా ఈ దేశంలో ఇదే పద్ధతి. వ్యవస్థకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ నడుచుకుంది అని చెప్పడానికి ఏమీ లేదు కదా అన్నారు.
ఏ ఒక్కరికో ఎందుకు మినహాయింపు ఇవ్వాలి ?
ఇతను ఇంతకుముందు ప్రభుత్వాన్ని నడిపారు. ఆ సందర్భంలో ఆ ప్రభుత్వంలో భారీగా ధనం దుర్వినియోగం అయిందని రకరకాల సంస్థల నుంచి ఎస్టాబ్లిష్ అయింది. ఇతని పేరును ఛార్జిషీట్ లో 37వ ముద్దాయిగా చేర్చి కోర్టు ముందు హాజరు పరిచారు. దానిని మనం తప్పు పట్టేందుకు వీల్లేదని సభ్య సమాజానికి విన్నవిస్తున్నాను. దేశంలో ఇదేమైనా కొత్తా.. ఈయన ఒక్కరిపైనా ఇలా వ్యవహరించిందా వ్యవస్థా ? మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కోర్టు ముందు నిలబడలేదా? మన రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఎదుర్కొన్న ఆరోపణలకు సంబంధించి కోర్టు ముందు నిలబడలేదా? పక్కనే ఉన్న తమిళనాడుకు చెందిన జయలలిత కోర్టు ముందు నిలబడలేదా? మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబడలేదా కోర్టు ముందు? పోనీ మేం అంతా నిలబడలేదా కోర్టు ముందు? ఎందుకు ఆయనకు ఒక్కరికే మినహాయింపు అవుతుంది? ఇందులో తెలిసీ,తెలియక ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది? దయచేసి అది కాదు మాట్లాడాల్సింది. మళ్లీ మాకు ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వండి అని అడిగినటువంటి వ్యక్తి.. తాము అధికారం ఇచ్చినప్పుడు ఇంతటి భారీ తప్పిదానికి పాల్పడ్డారు. అసలు ఇందులో వాస్తవాలు ఏమిటనేది ప్రజలు తెలియజేసేందుకు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వాలి.
అభియోగాలన్నవి తప్పు అని నిరూపించండి చాలు..
గతంలో ఇలాంటి ప్రభుత్వాలను నడిపినటువంటి వ్యక్తులు కూడా అమాయక ప్రజలను రెచ్చగొట్టి,వారిని ఉసిగొల్పి,దర్యాప్తు సాగనివ్వకుండా చేయడం,దర్యాప్తు అనేది ఓ మోటివ్ తో జరుగుతుందని అంటూ తప్పు దారి పట్టించడం ఇది కరెక్టు కాదన్నది నా అభిప్రాయం. మీకు నిజంగా దర్యాప్తులో పెట్టినటువంటి అంశాలు రుజువు చేసుకునేందుకు అవకాశం ఉంది. రుజువు చేసుకునే క్రమంలో కోర్టు పరిధిలో నమోదు అయిన అభియోగాలన్నవి తప్పు అని నిరూపించుకుంటే తప్పకుండా మీరు నిర్దోషిగా బయటపడతారు.
ప్రజాధనం దుర్వినియోగం గురించి దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి
ప్రజా జీవితంలో ఉండే ఇలాంటి వారు దర్యాప్తుకు సహకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. అసలు తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాన్నే సమాజం తప్పుపట్టాలని భావించే వ్యక్తిని నేను. మీరు ఏదో విధంగా తప్పించుకోవాలని చూడడం కరెక్టు కాదు. మనం ప్రమాణం చేసి వస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయమని. దుర్వినియోగం జరిగిందని దర్యాప్తు సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఇది మేం చెప్పిందో.. పోలీసు వ్యవస్థ చెప్పిందో కాదు
ఇందులో ఒక సంస్థ కాదు కదా ఎంత చెయిన్ ఇందులో ఉంది. ఇక్కడ అక్రమం జరిగిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అదే సమయాన అసలు మీరు చెబుతున్న సంస్థే లేదని ఎస్టాబ్లిష్ అయిందని చెబుతున్నాయి. ఆ మనీ అన్నది షెల్ కంపెనీలకు వెళ్లిపోయింది అని తేలిపోయింది. షెల్ కంపెనీలకు చేరిన మనీ మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి,మీకు చేరిందని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. ఇవాళ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఇద్దరూ దేశాన్ని విడిచి పారిపోయారు అన్నది ఎస్టాబ్లిష్ అయింది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా యి కదా.!
ఇందులో 37 మంది నిందితులు
అయినా ఇది మేం చెప్పిందో. పోలీసు వ్యవస్థ చెప్పిందో కాదు కదా! కోర్టు నిర్ణయించాల్సింది. ఇలాంటి సందర్భాన అరెస్టును తప్పు పడితే ఎలా ? దర్యాప్తు చేస్తున్న సంస్థలకు ఉద్దేశాలను ఆపాదిస్తే ఎలా ? ఇలాంటి విషయాలను దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థలను అభినందించాలి కానీ, ఇంకొకరు ఇటువంటి పొరపాటు చేయకుండా నిరోధించే స్థితిలో సమాజం ఉండాలి కానీ, అసలు దర్యాప్తు సంస్థలను తప్పు పట్టడం, దీనికి మోటివ్స్ ను యాట్రిబ్యూట్ చేయడం,అసలు దర్యాప్తు చేసేందుకే వీల్లేదని అనడం భావ్యం కాదు. ఏంటి మనం ఎటు వెళ్లిపోతున్నాం మనం. ఇది కరెక్టు కాదు.
పౌరుడిగా, మంత్రిగా నేను చెప్పేది ఒక్కటే..
నేను మాజీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. అనేక ఆధారాలతో మేం ఛార్జిషీటు పెట్టాం. రిమాండ్ రిపోర్టులు రాశాం. జ్యూడీషియరీ ముందుకు వచ్చారు. అది ప్రజలకు తెలిసిందే. అనేక మంది ఇన్వాల్వ్ అయ్యారు. 37 మంది ఇందులో నిందితులుగా ఉన్నారు. మీరు 37 వ ముద్దాయిగా ఉన్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు మీరు స్వచ్ఛందంగా దర్యాప్తునకు సహకరించాలి. దర్యాప్తు జరిగి ప్రజల ముందు,కోర్టులో మీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. నిర్దోషిగా బయటకు రావాలి. మీరు తప్పించుకునేందుకు చూస్తే మచ్చ మిగిలిపోతుంది. జ్యుడీషియరీలో మీరు నిర్దోషిగా బయటకు వస్తే మీ సచ్ఛీలత అన్నది ఏంటన్నది తేటతెల్లం అవుతుంది. అసలు దర్యాప్తు జరగనివ్వకుండా చేస్తే దోషివన్న సంగతి కోర్టు కన్నా ముందు ప్రజలే నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ఏది తప్పు ఏది ఒప్పు అన్నవి కోర్టు నిర్ణయిస్తుంది. కొన్నింటిని సమాజమే నిర్ణయిస్తుంది.
దర్యాప్తు సంస్థను అభినందించాల్సిందే
అనేక విషయాలు చూసిన వ్యక్తిగా,ఓ పౌరుడిగా,క్యాబినెట్ మినిస్టర్ గా చెబుతున్నది ఒక్కటే ఈ దేశంలో ఇదేం కొత్త కాదు. అనేక మంది పెద్దలు ఆరోపణలు ఎదుర్కొన్నారు. శిక్ష అనుభవించారు. నిర్దోషులుగా బయటపడ్డారు. మీరు కూడా ఇన్ని సాక్షాధారాలు న్నటువంటి కేసును దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సహకరించి,వారికి కావాల్సినటువంటి సమాచారం ఇచ్చి,నేనేం చేయలేదు. నేను ఏ తప్పూ చేయలేదు,ప్రొసీజర్ అలా ఉంది అని నిరూపించుకునేందుకు అవకాశం ఉంది కనుక జ్యుడీషియరీ ముందు చంద్రబాబు తనని తాను నిరూపించుకోవాలని కోరుతున్నాను.
మీరెవ్వరూ ఉద్రేక పడాల్సిన అవసరం లేదు
సభ్య సమాజానికి నేను కోరుతున్నదేంటంటే..ఇటువంటి ప్రజాధనం దుర్వినియోగానికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్న దర్యాప్తు సంస్థను అభినందించాలి. మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఇది. ఈ సంస్థ ఇలాంటి పెద్ద విషయాన్ని కనుక్కొని అనేక స్థాయిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించి,విదేశాలలో ఉన్న సంస్థకు ఇక్కడి నుంచి డబ్బు వెళ్లిందని చెబితే,ఆ సంస్థే మాకేం సంబంధం లేదని చెబితే,ఇలాంటి వాటిపై దబాయించడం ఏంటి ? అమాయక ప్రజలను రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఏంటి ?
ఎవ్వరైనా శిక్షఅనుభవించాల్సిందే
అందుకోసమే నేను సభ్య సమాజాన్ని కోరుతున్నది మీరెవ్వరూ ఉద్రేక పడాల్సిన అవసరం లేదు. దర్యాప్తులో భాగంగా సంబంధిత సంస్థలు లేదా అధికారులు లోతుగా వెళ్లిన తరువాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తుంది. మీరంతా తెలుసుకుంటారు. నిర్దోషి అయితే నిర్దోషిగా ఆయన బయటకు వస్తారు. లేదు దోషి అయితే ఈ దేశంలో ఒక్కొక్కరికీ ఒక్కో ఎగ్జమ్షన్ ఏమీ ఉండదు. ఎవ్వరైనా దోషిగా ఉంటే దోషి శిక్షను అనుభవించాల్సిన అవసరం ఉంటుంది. ఇది నేను ముక్తాయిం పుగా చెప్పాలనుకుంటున్నాను. పౌరులంతా ఇది గమనించాలని ఈ సందర్భంగా కోరుతున్నానన్నారు మంత్రి ధర్మాన.
ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘స్కిల్’ స్కాం: కోర్టులో ఎవరి వాదన ఏంటీ?
Comments
Please login to add a commentAdd a comment