ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: ప్రజల కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక పాలసీ క్షేత్రస్థాయిలోకి ఏ స్థాయికి ఎలా వెళుతుందో, ఎలా అమలు జరుగుతుందో, దాన్ని ప్రభావాలను అంచనా వేయలన్న ఆలోచనల నుంచి పుట్టినదే ‘గవర్నెన్స్ ల్యాబ్‌లు’ అని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. కాన్ఫరెన్స్ ఆన్ ఇండియా సమావేశంలో పాల్గొన్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ‘వేగవంతమైన వృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు’ అనే అంశంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో గవర్నెన్స్ ల్యాబ్‌లు మైలురాళ్లు మారుతాయని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఇస్తోన్న ప్రోత్సాహక విధానాలు, పద్ధతులు సరిగ్గా లేవని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.
ప్రోత్సాహకాల విషయంలో ఒక పద్ధతి, బడ్జెట్ ఉండాలన్నారు. ప్రోత్సాహాల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకువస్తే చాలా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటాయని పేర్కొన్నారు. క్రమశిక్షణ లేని ప్రోత్సాహకాలే కాదు ఏదీ మంచిది కాదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయమని తెలిపారు. మారే పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మన ఆలోచనలను సరిదిద్దుకోవడమే అసలైన సంస్కరణ అని చెప్పారు. చైనాకు ప్రత్యామ్నాయం భారతదేశం మాత్రమేనని, పర్యావరణ హిత పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాలిచ్చే పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని వివరించారు.
కరోనా సమయంలో పరిశ్రమలు ప్రభుత్వానికి అందించిన తోడ్పాటు మరవలేనిదని అన్నారు. మెడికల్ ఆక్సిజన్, బెడ్స్ వంటి సహా అనేక అంశాలలో సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ 19 ప్రతి మనిషి మీద అనేక రకాలుగా ప్రభావం చూపిందని, భౌగోళిక, భౌతిక, వాతావరణ మార్పులకు కరోనా మేల్కొలుపని అన్నారు. అభివృద్ధి సంబంధిత శాఖలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని చెప్పారు.
సంక్షేమం, సమాన అవకాశాలు, విలువైన విద్య, వైద్యం, విజ్ఞాన, పారిశ్రామిక వంటి అనేక రంగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంస్కరణలు తీసుకువచ్చిందని తెలిపారు. సరికొత్త మార్పులకు తగ్గట్లుగానే సరికొత్త విధానాలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment