‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’ | Minister Kakani Govardhan Reddy Takes On Ramoji Rao | Sakshi
Sakshi News home page

‘రైతులను అడ్డంపెట్టుకుని రామోజీ గలీజు రాతలు’

Published Tue, May 2 2023 10:44 AM | Last Updated on Tue, May 2 2023 10:57 AM

Minister Kakani Govardhan Reddy Takes On Ramoji Rao - Sakshi

నెల్లూరు: రైతులను అడ్డంపెట్టుకుని ఈనాడు రామోజీరావు గలీజు రాతలు రాస్తున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. నిన్న వర్షం కురిస్తే, ఈరోజు పరిహారం ఇవ్వాలి అన్నట్లు ఈనాడు రాతలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. సీజన్‌ ముగిసేలోపే పరిహారం అందిస్తున్న ప్రభుత్వం తమదని, గతంలో చంద్రబాబు రెండేళ్లకు పంట నష్ట పరిహారం చెల్లించే విషయం రామోజీ గుర్తుంచుకుంటే మంచిదన్నారు. నెల్లూరు క్యాంపు ఆఫీస్‌లో మంత్రి కాకాణి మాట్లాడుతూ.. ఏమన్నారంటే..

రామోజీ గలీజురాతలు
రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రధానరంగంగా గుర్తించి.. రైతులకు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించి, వారికి అండగా నిలవాలని గౌరవ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తపన పడుతున్నారు. ఆమేరకు రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి వాతావరణం చూసి అటు టీడీపీ నేతలు, ఇటు పచ్చమీడియా అధిపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే, రోజుకో గలీజు రాతలతో ఈనాడు రామోజీరావు రైతులను అడ్డం పెట్టుకుని తన నిజస్వరూపాన్ని ప్రదర్శించుకుంటున్నాడు. ఇందులో భాగంగా రైతులకు, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడం ఈనాడు రామోజీరావుకు ఆనవాయితీగా మారింది.

మా ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో ఏదైనా పొరబాట్లు జరుగుతుంటే, వాటిని పత్రికలు ఎత్తిచూపొచ్చు. వ్యవస్థలో ఎక్కడైనా అన్యాయం, మోసం జరిగితే.. వాటిని జర్నలిజంలో భాగంగా బహిరంగ పరచడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ, ఈరోజు ఈనాడు రామోజీ రాస్తున్న వార్తలు పక్షపాత వైఖరితో రాస్తున్నారు. మా ప్రభుత్వం మీద ఉన్నది లేనట్లు చూపించే ప్రయత్నం జరుగుతుంది. గతంలో జరగని వాటిపై మౌనంగా ఉండటం.. చేయని వాటిని ఎత్తిచూపకపోవడం ఈనాడు నేర్చిన నైజం. రామోజీరావు రాయించే కథనాల హెడ్డింగ్‌లకు లోపల రాసిందానికి ఏమాత్రం పొంతన ఉండదు. అన్నీ అభూతకల్పనలు, అసత్యాలు, ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నమే కనిపిస్తుంది. వీటిని రైతులు నమ్మరుకాక నమ్మరని ఘంటాపథంగా చెబుతున్నాను. 

బాబు హయాంలో రెండేళ్లతర్వాతే పరిహారంః 
నిన్న వర్షం కురిస్తే ఈరోజే నష్టపరిహారం ఇవ్వలేదన్నట్టుగా ఈనాడు తప్పుడు రాతలు రాస్తుంది. అసలు, వర్షం కురవడమే.. ఈ ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా రామోజీరావు వార్తలు  రాస్తున్నాడు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరువు, వరదలే కదా..?  2014–15 కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్‌ మాసాల్లో వర్షాలు వస్తే.. ఆయన 2016 జూలైలో అంటే, దాదాపుగా రెండేళ్ల తర్వాత రైతులకు పంటనష్టపరిహారం అందించారు. అదికూడా అరాకొరాగానే పంపిణీ చేశారు.

రైతుకు తీవ్రంగా పంటనష్టం వాటిల్లితే.. ప్రభుత్వ అధికారులు వేసిన అంచనాలను పరిగణలోకి తీసుకుని కోత విధించి పరిహారాన్ని అందించిన సందర్భాలున్నాయి. అదేవిధంగా 2014లోనే కర్నూలు జిల్లాలో కరువు వచ్చినప్పుడు దానికి సంబంధించిన కరువుభృతిని 2017లో అందించారు. ఆ తర్వాత 2015 ఏప్రిల్‌ మాసంలో అకాలవర్షాలు కురిస్తే..  ఏడాది తర్వాత అంటే, ఆగస్టు 2016లో పంటనష్టపరిహారాన్ని ఇచ్చారు. 2015లో కరువు వస్తే నవంబర్‌ 2016లో పరిహారం అందించారు. అనంతపురం జిల్లాలో 2016 మే మాసంలో అకాలవర్షాలు కురిస్తే దానికి సంబంధించి పంటనష్టపరిహారాన్ని నవంబర్‌ 2016లో అందించారు. బాబు హయాంలో కరువు వచ్చినా.. వరదలొచ్చినా.. అకాలవర్షాలు కురిసి పంటనష్టపోతే సీజన్‌లోపల కాకుండా.. రెండేళ్ల తర్వాతనే పరిహారం అందించిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు మా ప్రభుత్వం ఏ సీజన్ లో జరిగిన నష్టానికి, ఆ సీజన్ లోనే పరిహారం అందజేస్తున్నాం. 

బాబు ఎగ్గొట్టిన బకాయిలు రూ. 5, 942 కోట్లు
చంద్రబాబు పెట్టిన ఇన్‌పుట్‌సబ్సిడీ పెండింగ్‌ బకాయిలను చూస్తే.. 2014–15లో రూ.27 కోట్లు బకాయిలు పెట్టారు. సరే, పాలన మొదటి సంవత్సరం కాబట్టి అంత పెట్టారనుకుందాం. 2015–16లో రూ.268 కోట్లు బకాయిలు పెట్టారు. 2016–17లో రూ. 10 కోట్లు, 2017–18లో రూ. 13.73 కోట్లు పెండింగ్‌ బకాయిలు పెట్టగా, ఇక 2018–19 వచ్చేసరికి, ఖజానాలోని డబ్బులన్నింటీని పసుపు కుంకుమకు మరల్చి రూ.2,258 కోట్లు ఎగనామం పెట్టి బాబు అధికారం దిగిపోయి వెళ్లాడు. రైతులకు మాయమాటలు చెప్పి బకాయిలు ఎగొట్టిన బాబుపై.. ఒక్క వార్త కూడా రాయకుండా ఈనాడు ఆయనకు బ్రహ్మరథం పట్టడంలో ఆంతర్యమేంటో రైతులకు బాగా తెలుసు. 

- దాదాపుగా రూ.5,942కోట్లు అన్నిరకాలుగా రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఎగొట్టిన ఘనుడు ఈ చంద్రబాబు.  ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.960 కోట్లు చంద్రబాబు బకాయిలు పెట్టిపోతే వాటిని మేం తీర్చాం.

చంద్రబాబు హయాంలో సబ్సిడీ సీడ్స్‌కు సంబంధించి రూ.282 కోట్లు రైతులకు బకాయిలు పెట్టి వెళ్లిపోయాడు. సున్నావడ్డీ పంటరుణాలకు సంబంధించి రైతులకు రూ.1180 కోట్లు బకాయిలు మాఫీ చేయకుండా చేతులెత్తేసి పోయాడు. రైతులు పంటనష్టపోయినప్పుడు బీమాకింద చెల్లించాల్సిన రూ.780 కోట్లు ఎగనామం పెట్టాడు. ఆత్మహత్యలు చేసుకున్న 474 రైతు కుటుంబాలకు అందజేయాల్సిన రూ.23.70 కోట్లు ఎగొట్టి పోతే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మానవతాధృక్పథంతో ఆ మొత్తాన్ని అందించి ఆయా రైతు కుటుంబాల్ని ఆదుకున్న గొప్పనాయకుడు అని గర్వంగా చెబుతున్నాను. చివరికి,   ఇటువంటి మంచి ముఖ్యమంత్రి గారి గురించి.. ఆయన రైతులకు చేసిన మేలు గురించి ఒక్క వార్త రాయడానికి రామోజీరావుకు దమ్ములేదా..? అని నిలదీస్తున్నాను.  

ఏ సీజన్ లో పరిహారం ఆ సీజన్ లోనే
అదే 2019 నుంచి 2022 – 23 వరకు మా ప్రభుత్వం వెంటవెంటనే రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాం. 2019లో వరదలొస్తే ఏప్రిల్‌ 2020లో రైతులకు పరిహారం అందించాం. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు వచ్చిన అకాలవర్షాలకు సంబంధించి అక్టోబర్‌ 2020లోనే పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశాం. అక్టోబర్‌ 2020లో కురిసిన వాటికి నవంబర్‌ 2020లోనే వేశాం. నివర్‌ తుఫాన్‌ నవంబర్‌ 2020లో సంభవించినప్పుడు జరిగిన పంటనష్టపరిహారాన్ని డిసెంబర్‌ 2020లోనే విడుదల చేశాం.

తిత్లీ తుఫాన్‌ సమయంలో సంభవించిన నష్టపరిహారాన్ని చంద్రబాబు ఎగొట్టి పోతే,  గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి ప్రభుత్వపరంగా రూ.182 కోట్లు రైతులకు పంపిణీ చేశారు. మాండవిస్‌ సైక్లోన్‌ డిసెంబర్‌ 2022లో వస్తే..  ఫిబ్రవరి 2023లోనే రైతులకు పరిహారం అందించాం.  ఏ సీజన్ లో పంట నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోపుగానే పంటనష్టపరిహారం గానీ ఇన్‌పుట్‌ సబ్సిడీ గానీ పూర్తిగా చెల్లించాం. ఇవన్నీ ఈనాడులో రాయించే దమ్మూధైర్యం రామోజీరావుకు ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నాను. 

- అలానే, ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించి 2019 నుంచి 2023 వరకు రూ.1911.81కోట్లు మా ప్రభుత్వం అందించిందని మేం గర్వంగా చెబుతున్నాం. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో రైతులకు పరిహారం అందించిన దమ్మున్న ప్రభుత్వం మాది అని చెబుతున్నాం. ఈ మాటను రాసే సత్తా రామోజీరావుకు ఉందా..? అని నిలదీస్తున్నాను.

బాబు చెప్పినట్టుగా అకాల వర్షాలను ఆపగలికే శక్తి మాకు లేదు
తుఫాన్‌లు, వరదలు, అకాలవర్షాలను ఆపగలిగే శక్తి సామర్ధ్యాలు చంద్రబాబుకు ఉంటాయేమో గానీ మాకు మాత్రం లేవని స్పష్టం చేస్తున్నాను. తుఫానులు వస్తున్నప్పుడు వాటిని  అణచివేశానని .. అకాలవర్షాలకు చక్రం అడ్డంవేశానని తనకు అతీంద్రీయమైన శక్తులు ఉన్నాయన్నట్టుగా బాబు గతంలోనే చెప్పాడు. అవన్నీ నిజమని రామోజీరావు భావిస్తున్నారేమో గానీ.. ప్రజలు గానీ, మేము గానీ నమ్మడంలేదు. 
- దాదాపు 22 లక్షల మంది రైతులకు ప్రభుత్వపరంగా సీజన్‌ ముగిసేనాటికి వారికి అందాల్సిన నష్టపరిహారాన్ని అందించే బాధ్యతను సమర్ధంగా నిర్వర్తించడంలో మేము, మా ప్రభుత్వం ముందున్నది. 

కరువు మండలాలు లేకపోతే రామోజీ బాధ ఏంటి?
-రామోజీరావు కంపు రాతలు ఎలా ఉన్నాయంటే.. మొన్న కరువు మండలాలు ప్రకటించలేదని రాశారు. కరువే రానప్పుడు కరువు మండలాలు ప్రకటించాలనే దిక్కుమాలిన రాతలు రాసే దౌర్భాగ్యం ఎందుకు రామోజీ..? అని అడుగుతున్నాను. బాబు హయాంలో ఉన్న కరువుకాటకాల పరిస్థితులే.. ఈరోజు కూడా కనిపించాలని రామోజీరావు తెగ తాపత్రయపడుతున్నాడు. కరువు లేకపోతే రామోజీ బాధ పడిపోవడం ఏమిటి.. అని ప్రశ్నిస్తున్నాను. 

వర్షాలు తగ్గాక నష్టాన్ని అంచనా వేసి, రైతుల్ని ఆదుకుంటాం
ప్రస్తుతం రాష్ట్రంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు తగ్గాక ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యటించి.. పంటనష్టాన్ని పరిశీలించి అంచనాలు తయారు చేస్తుంది. సీజన్‌ ముగిసేనాటికి పరిహారం అందివ్వాలనే లక్ష్యాన్ని నియమంగా పెట్టుకున్నాం. రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని  గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు సూచించిన విధంగా మేము, మా అధికారులు నష్టపోయిన రైతుల్ని ఆదుకునేందుకు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం. రైతుల శ్రేయస్సే ఈ ప్రభుత్వం లక్ష్యం. 

జగన్‌  పాలనంటేనే రైతురాజ్యం
రైతుభరోసా కేంద్రాల్లో వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలపై రోజువారీ మానిటరింగ్‌ వ్యవస్థను మేం నడిపిస్తున్నాం. ఎక్కడైతే రైతు నష్టపోతున్నాడని మా మానిటరింగ్‌లో తెలుస్తుందో.. వెంటనే అక్కడకి మా అధికారులను పంపించి రైతుల్ని ఆదుకునే చర్యలు చేపడుతున్నాం. ఈరోజు కూడా మొక్కజొన్న పంటకొనుగోలుకు సంబంధించి అధికారులకు సూచనలు కూడా ఇచ్చాం. ఆఖరికి, కేంద్రప్రభుత్వం నోటిఫై చేయనటువంటి పంటలకు కూడా మద్ధతుధర నిర్ణయించి, వాటిని కొనుగోలు చేస్తూ రైతులకు అండగా ఈ ప్రభుత్వం నిలుస్తోంది. మా నాయకుడు పాలనంటేనే రైతురాజ్యం అని రైతులంతా గర్వంగా చెబుతారు. బాబును భుజానికెత్తుకుని మోస్తున్న పచ్చమీడియా ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు రాస్తే బాగుంటుందని హితవు పలుకుతున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement