
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేసేంత స్థాయి నారా లోకేశ్‌కు లేదన్నారు మంత్రి కొడాలి నాని. సీఎం జగన్‌ను ఎదుర్కొనే దమ్ము ఎవరికీ లేదని, అలాంటి దమ్మే ఉంటే తనపై పోటీ చేసి గెలవమని కొడాలి నాని, లోకేశ్‌కు సవాల్ విసిరారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రజల్లో ఆదరణ లేని దద్దమ్మలు ఇవాళ విమర్శలు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రజలది. ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లోకేశ్ కు లేదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని అసమర్థుడు నారా లోకేష్’’ అని ప్రస్తావించారు మంత్రి కొడాలి నాని.
న్యాయస్థానాలపై తనకు ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారని, కానీ, ఈ అంశంపైనా ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఈసారి టీడీపీ కి ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. సమగ్ర అభివృద్ది...వికేంద్రీకరణపై ప్రభుత్వ వైఖరిని సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా వివరిస్తే.. ఎల్లో మీడియాతో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు మంత్రి కొడాలి నాని.