సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమిత్‌షా, సీఎం జగన్ కలయిక వెనుక ఇష్టానుసారంగా ఎల్లోమీడియా రాతలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. పిచ్చిరాతలతో ఎల్లో మీడియా ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు తన హయాంలో ఆలయాలు కూలగొట్టించలేదా?. అప్పుడు ఆయనకు హిందుత్వం గుర్తుకురాలేదా?’’ అని నిలదీశారు. అంతర్వేది రథం ఘటనలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించిందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లేందుకే ప్రతిపక్షాలు సమయం కేటాయిస్తున్నాయని మంత్రి కన్నబాబు దుయ్యబట్టారు. (చదవండి: సమీక్షించకపోతే 2జీ స్కాం బయటకు వచ్చేదా?)
రైతులు కష్టాలు పడకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని కన్నబాబు పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ ధరల్లో తెలంగాణతో ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు రూ.80 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంట కొనుగోళ్లను టన్నుకు రూ.11 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. పెదవేగి ఫ్యాక్టరీకి తరలించే రైతులకు ఈ ధరల చెల్లింపు చేస్తామన్నారు. ఆయిల్ ఫామ్‌కు మద్దతు ధర ప్రకటించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. మార్కెటింగ్ వ్యవస్థను రైతులకు మరింత చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వివిధ వాణిజ్య పంటలను ప్రాసెసింగ్ చేయడం ద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేందుకు నిర్ణయించామన్నారు. త్వరలో ఆహారశుద్ధి పాలసీని ప్రకటిస్తామని వెల్లడించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలను ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలోకి తెస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వమే సొంతంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆలోచన చేస్తోందని మంత్రి కన్నబాబు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment