సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి సీదిరి అప్పలరాజు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): విశాఖలో సమన్వయంతో చేపల వేట సాగించుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాలతో కలిసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టపరిధిలో నిబంధనలను అనుసరిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మత్స్యకారులు వేట సాగించాలన్నారు. మత్స్యకారుల మధ్య ఇంతకాలం లేని పొరపొచ్చాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ఆలోచించాలన్నారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులతో టెక్నికల్ కమిటీని వేశామని.. మెరైన్ ఫిషరీస్ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం బోట్లు ఉన్నవారందరూ వేట సాగించడానికి, వలలకు సంబంధించి లైసెన్స్‌లు పొందాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు, వీఎంఆర్‌డీఏ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అధికారులు, మత్స్యకార నేతలు పాల్గొన్నారు.
అరెస్టులను నిరసిస్తూ మత్స్యకారుల ఆందోళన
కాగా, విశాఖలో మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి ఆందోళనకు దారితీసింది. రింగు వలల వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బోట్లు దగ్ధం చేసిన ఘటనలకు సంబంధించి పిల్లా నూకన్న, వాడమధుల సత్యారావు అనే ఇద్దరిని విశాఖ మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరి అరెస్టులను నిరసిస్తూ పెదజాలరిపేట మత్స్యకారులు వాల్తేర్ ఆర్‌టీసీ డిపో కూడలిలో ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ అయిన ఇద్దరు మత్స్యకారులను పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో విశాఖలోని తీరప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment