minority scholarship website hacked - Sakshi
Sakshi News home page

మైనార్టీ స్కాలర్‌షిప్‌ల వెబ్‌సైట్‌ హ్యాక్‌! 

Published Fri, Jan 29 2021 10:16 AM | Last Updated on Fri, Jan 29 2021 10:31 AM

Minority Scholarship Website Hacked - Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి చెందిన మైనార్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ వెబ్‌సైట్‌ను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేశారు. కాలేజీ యాజమాన్యాలకు తెలియకుండానే వాటి లాగిన్‌ ఐడీ ద్వారా విచ్చలవిడిగా దరఖాస్తులు చేశారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్షల్లో. ఏటా వచ్చే దరఖాస్తుల కంటే సుమారు 80లక్షలు అదనంగా వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ రీవెరిఫికేషన్‌ నిమిత్తం ఆ నకిలీ దరఖాస్తుల గురించి ఆయా రాష్ట్రాలను అప్రమత్తంచేసి వాటిని ఆన్‌లైన్‌లో తిప్పి పంపింది. మన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారిస్తే అనేక విషయాలు బయటపడ్డాయి. అవి ఏమిటంటే.. 

రాష్ట్రంలోని పలు కాలేజీలు, స్కూళ్లలో పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నట్లు 
ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేశారు.  
ఇలా విజయవాడలోని పలు శ్రీ చైతన్య కాలేజీల నుంచి సుమారు వెయ్యి మంది మైనార్టీ విద్యార్థుల పేర్లతో నకిలీ 
దరఖాస్తులు వెళ్లాయి.  
అలాగే, విజయవాడలోని మరో హైస్కూలు నుంచి 150 మంది మైనార్టీ విద్యార్థుల పేర్లతో దరఖాస్తులు చేశారు. నిజానికి ఈ స్కూలులో మైనార్టీ విద్యార్థులు ఒక్కరు కూడా దరఖాస్తు చేయలేదు.  
ఇలా ఏపీ నుంచి మొత్తం 3లక్షల నకిలీ దరఖాస్తులు వెళ్లాయి. 

ఇవన్నీ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల అడ్రస్‌లతో ఏపీలోని కాలేజీలు, స్కూళ్ల నుంచి దరఖాస్తులు చేసినట్లు రికార్డ్‌ అయింది.  దీంతో కాలేజీ యాజమాన్యాలను పిలిపించి వారి స్కూలు నుంచి ఎంతమంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారనే వివరాలు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు సేకరిస్తున్నారు. వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి కాలేజీ నుంచి వెళ్లిన అసలైన దరఖాస్తులు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తొలగిస్తున్నారు. అసలు తాము దరఖాస్తే చేయకుండా తమ స్కూలు నుంచి దరఖాస్తు చేసినట్లు వెబ్‌సైట్లోకి ఎలా వచ్చాయో అర్థంకావడం లేదని యాజమాన్యాలు చెబుతున్నట్లు 
అధికారులు తెలిపారు.

ఎవరెవరికి ఇస్తారంటే..
మైనార్టీ విద్యార్థులు కేంద్ర స్కాలర్‌షిప్‌ల కోసం వెబ్‌సైట్లో నేరుగా కాలేజీల నుంచి దరఖాస్తులు చేసుకుంటారు. మంజూరు కాగానే స్కాలర్‌షిప్‌ డబ్బులు నేరుగా విద్యార్థి అకౌంట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా జమ అవుతాయి. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పారసీలు, జైనులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రూ.లక్షలోపు ఆదాయం ఉన్న విద్యార్థులకు ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు రూ.వెయ్యి, 6–10వ తరగతి విద్యార్థులకు రూ.5,000లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అలాగే, పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద ఇంటర్మీడియెట్‌ వారికి రూ.6,000లు, అండర్‌ గ్రాడ్యుయేట్స్‌కు రూ. 6,000లు నుంచి 12,000ల వరకు ఇస్తారు. వీరికి రూ. 2లక్షల లోపు ఆదాయం ఉండాలి. ప్రొఫెషనల్‌ కోర్సులు, సాంకేతిక విద్యా కోర్సులు చదువుతున్న వారికి రూ.25 వేల నుంచి రూ.30వేల వరకు ఏటా ఇస్తారు. వీరికి సంవత్సర ఆదాయం రూ.2.5 లక్షలకు మించకుండా ఉండాలి.

సైబర్‌ నేరగాళ్ల పని..
వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేయడం ద్వారా సైబర్‌ నేరగాళ్లు కాలేజీల లాగిన్‌ ఐడీలు తెలుసుకుని నకిలీ పేర్లతో దరఖాస్తులు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే, కొందరు కాలేజీల యజమానులు కాలేజీ నుంచి విద్యార్థులతో దరఖాస్తులు చేయకుండా ఇంటర్‌నెట్‌ సెంటర్‌ల వారికి అప్పగించి వారికి కాలేజీ లాగిన్‌ ఐడీ చెప్పడంవల్ల కూడా దుర్వినియోగం చేసి ఉండవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇలాంటి కాలేజీలు, స్కూళ్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై సమగ్రమైన దర్యాప్తుకు కేంద్రం ఆదేశించనుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement