సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లులో పనిచేస్తున్న కార్మికులతో యాజమాన్యం ముందస్తుగా పదవీ విరమణ చేయిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. కార్మికులకు అందాల్సిన ప్రయోజనాలను అందనీయకుండా యాజమాన్యం, కార్మిక సంఘం నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యంతో చర్చించడానికి సోమవారం ఉదయం 11 గంటల సమయంలో రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు వద్దకు రాజా వెళ్లారు. అయితే యాజమాన్యం పట్టించుకోకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆందోళన నిర్వహించారు. అనంతరం కోటిలింగాలపేట పంప్‌హౌస్ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదే సమయంలో కొందరు యువకులు పంప్‌హౌస్ పైకి ఎక్కి గోదావరిలో దూకేస్తామంటూ నినాదాలు చేయడంతో పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంప్‌హౌస్ నుంచి తిరిగి పేపర్ మిల్లు గేటు వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే రాజా అక్కడే బైఠాయించి అర్ధరాత్రి కూడా నిరసన కొనసాగిస్తున్నారు. పేపరు మిల్లు యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చే వరకూ కదలబోమని స్పష్టం చేశారు.
యాజమాన్య నిరంకుశ ధోరణికి నిరసనగా కార్మికులు సైతం సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీయడానికి పేపర్ మిల్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయకృష్ణ, గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేత పనిచేస్తున్నారని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా వేతన ఒప్పందం కుదరకపోవడంతో కార్మికులు నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లులో పనిచేస్తున్న సీనియర్ కార్మికులను బలవంతంగా వీఆర్‌ఎస్ పేరిట బయటకు పంపిస్తున్నారని ధ్వజమెత్తారు. వారి స్థానంలో నైపుణ్యం లేని కొత్త యువకులను నియమించుకుంటున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment