సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అద్దం పడుతోందని ఎమ్మెల్యేలు సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల అనంతరం వెనుకబడిన వర్గాలు, గిరిజన, మహిళా, శిశు సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖల పద్దులపై పలువురు మాట్లాడారు.
జగన్ పేరును గిన్నిస్ బుక్‌లో లిఖించాలి
ఒకే రోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన సాహసోపేత నాయకుడు ప్రపంచంలో సీఎం వైఎస్ జగన్ తప్ప మరెవరూ లేరు. అందుకే ఆయన పేరును గిన్నిస్ బుక్‌లో లిఖించేలా సభ తీర్మానం చేసి పంపాలి. వేల ఎకరాల భూమిని పరిశ్రమలకు కారు చౌకగా కేటాయించిన చంద్రబాబు.. కనీసం పేదలకు వంద ఎకరాలు కూడా ఇవ్వలేకపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బీసీల్లో ఆత్మస్థైర్యం పెరిగింది. 139 బలహీన వర్గాల కులాలను గుర్తించి సామాజిక, రాజకీయ న్యాయం దిశగా నడిపిస్తున్న ఏకైక నాయకుడు జగన్. అమ్మ ఒడి కింద రూ.13 వేల కోట్లు ఖర్చు పెడితే అందులో రూ.5,900 కోట్లు బీసీ తల్లులకే కేటాయించారని గర్వంగా చెబుతున్నా.
– కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు
బీసీల సొంతింటి బిడ్డ జగన్
సీఎం వైఎస్ జగన్‌ను బీసీలు తమ సొంతింటి బిడ్డగా భావిస్తున్నారు. దేశంలో మొదటిసారిగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. ఏ సీఎం చేయని విధంగా బీసీలకు పెద్దపీట వేశారు. సంచార జాతులను గుర్తించి సమాజంలో గౌరవాన్ని కల్పించడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. అందుకే బీసీ సంక్షేమంలో దేశం ఏపీ వైపు చూస్తోంది. బీసీల కోసమే తమ పార్టీ ఉందని గొప్పలు చెప్పే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బీసీ సబ్‌ప్లాన్‌కు ఏటా రూ.10 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి ఐదేళ్లలో రూ.17వేల కోట్లు మాత్రమే ఇచ్చారు. మా ప్రభుత్వం రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి.. మూడేళ్లలో రూ.63,327 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది.
– కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే, తణుకు
గిరిజన ఆరోగ్య ప్రదాత
పాడేరులో రూ.500 కోట్లతో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ గిరిజన ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్నారు. సుస్తి చేస్తే వైద్యం అందక చనిపోయే రోజులు గిరిజనులకు రాకూడదనే ఉద్దేశంలో ప్రతి ఐటీడీఏ పరిధిలో స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు అందించి పోడు వ్యవసాయం చేసుకుంటున్న లక్షల మంది గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపారు. పేద గిరిజనులపై ఓటీఎస్ భారం పడకుండా ఇంటి హక్కులు కల్పించాలని కోరిన వెంటనే ఉదార స్వభావంతో షెడ్యూల్ 5లోని అన్ని నియోజకవర్గాల్లో ఓటీఎస్ రద్దు చేసిన మహనీయుడు మా జగనన్న. గిరిజన మనోభావాలను గౌరవిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖనిజ సంపద దోపిడీకి అడ్డుకట్ట వేశారు.
– కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు
మహిళా సాధికారతతో ముందడుగు
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలను కేంద్ర బిందువుగా చేసుకుని అనేక సంక్షేమ పథకాలతో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు సంకల్పించారు. అందుకే మహిళా సాధికారత, మహిళా సంక్షేమంలో మన రాష్ట్రం వేగంగా ముందుకెళ్తోంది. ప్రతి మహిళకు అమ్మఒడి, జగనన్న ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, కాపు నేస్తం వంటి పథకాలతో ఏడాదికి రూ.60 వేల వరకు లబ్ధి చేకూరుతోంది. దీనివల్ల మహిళలు పురుషులతో సమానంగా ఆర్థికంగా ఎదుగుతున్నారు. దీనికి తోడు పేదలందరికీ ఇళ్ల పథకంలో ప్రతి పేద మహిళకు సుమారు రూ.7 లక్షలు విలువైన ఆస్తిని ఇస్తున్నారు. మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాలు సైతం ఏపీని అనుసరించేలా పాలన కొనసాగుతోంది.
– విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట
దేశం చూపు.. ఏపీ వైపు
దేశం మొత్తం తలెత్తుకుని చూసేలా రాష్ట్రంలో మహిళా సాధికారత అమలవుతోంది. మహిళలు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటూ.. ఆర్థికంగా నిలబడే ధైర్యాన్ని సీఎం జగన్ కల్పించారు. సంక్షేమ పథకాల ద్వారా వారు సొంత కాళ్లపై నిలబడే అవకాశం ఇచ్చారు. మహిళలు తమకంటూ ఆస్తిని సమకూర్చుకునేందుకు చేయూతనిచ్చారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాడానికి చాలా ప్రభుత్వాలు కష్టపడ్డాయి. ఇంకా కష్టపడుతున్నాయి. కానీ, సీఎం జగన్ 50 శాతం రిజర్వేషన్లు పారదర్శకంగా అమలు చేస్తూ మహిళలను ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి చరిత్ర సృష్టించారు.
– కె.నాగార్జునరెడ్డి, ఎమ్మెల్యే, మార్కాపురం
బడుగు వర్గాల అభివృద్ధికి అద్దం పట్టే బడ్జెట్
Published Thu, Mar 17 2022 3:39 AM | Last Updated on Thu, Mar 17 2022 2:53 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment