
సాక్షి, విజయవాడ: కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఫ్యాన్ వీచిన గాలికి సైకిల్ కనుమరుగైంది. ఒకవైపు టీడీపీ పార్టీని తమ భుజాలపై మోస్తున్న కార్యకర్తలను, నాయకులను ఓదార్చాల్సిన బాధ్యత మరిచిన ఆ పార్టీ అగ్రనాయకులు ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా విజయవాడ కార్పోరేషన్ పరిధిలో ఈ తరహా ఘటన చోటు చేసుకుంది. విజయవాడ 42 వ డివిజన్ నుంచి పోటీచేసి ఓడిపోయిన టీడీపీ కార్పోరేటర్ అభ్యర్ధి యెదుపాటి రామయ్యపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న బెదిరింపులకు దిగారు.
యెదుపాటి రామయ్య ఫేస్‌బుక్‌లో టీడిపీ నాయకులను విమర్శించారు. ‘ఒక్క ప్రెస్‌మీట్‌తో 20 మంది కార్పోరేట్ అభ్యర్ధులం ఓడిపోయాం. మన ఓటమికి కారణం ఎవరో మనందరికి తెలుసు ’ అని పశ్చిమ నియోజక వర్గ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు తెలిపారు. ఈ విషయాన్ని లేవనెత్తినందుకు గాను బుద్దా వెంకన్న నుంచి బెదిరింపుకాల్స్ వచ్చాయని తెలిపారు. ఆ ఆడియోను విడుదల చేశారు యెదుపాటి రామయ్య. ఇప్పుడు ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చివరగా తమకు ఇక ఫోన్లు చేయవద్దని, అవసరమైతే పార్టీని వీడుతామని రామయ్య భార్య రమణి తెలిపారు. అదే సమయంలో తాము ఊరు వదిలిపెట్టి వెళ్లిపోతాం సార్ అంటూ ఫోన్ పెట్టేశారు రమణి.
Comments
Please login to add a commentAdd a comment