108.. ఆపదలో ఉన్న వారికి సంజీవని.. ఒక్క ఫోన్ కాల్‌తో రెక్కలు కట్టుకుని నిమిషాల్లో వచ్చి వాలిపోతుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుంది. రోజూ ఎంతోమంది ప్రాణాలు నిలుపుతోంది. ఇదే తరహాలో ఇప్పుడు పశువులకు కూడా సేవలందించడానికి ప్రత్యేక వాహనం అందుబాటులోకి రానుంది. మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు) పేరిట పశువుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం వీటిని తీసుకొచ్చేందుకు ప్రణాళిక చేసింది.
సాక్షి, అమరావతి బ్యూరో: పశువుల ఇళ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలందించడానికి మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశువైద్యశాలలు)లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొబైల్ వాహనాన్ని కేటాయించింది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 వాహనాలను మంజూరు చేసింది. జిల్లాల పునర్విభజనతో కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో విలీనం కావడంతో 14 వాహనాలు సమకూరాయి. వివిధ రోగాలు, ప్రమాదాల్లో గాయాల పాలైన ఈ మూగజీవాలకు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఈ సంచార శాలల్లో పశువైద్యులు, వైద్య పరీక్షల కోసం ల్యాబ్ ఉంటుంది. ఒక్కో వాహనంలో ఒక పశు వైద్యుడు, పారా వెట్ సిబ్బంది ఒకరు, డ్రైవరు ఉంటారు.
సేవలు పొందడం ఇలా..
సంచార పశువైద్య సేవలు పొందడానికి 1962 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులోకి తీసుకురానున్నారు. తమ పశువుకు వైద్య చేయించాలనుకున్న వారు ఈ నంబరుకు ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న సంచార పశువైద్య వాహన సిబ్బందికి సమాచారం ఇస్తారు. సత్వరమే ఆ వాహనంలో ఉన్న పశువైద్యుడు, సిబ్బంది పశువున్న చోటకు (గరిష్టంగా 90 నిమిషాల లోపు) వెళ్లి వైద్యం అందిస్తారు. ఈ మొబైల్ వాహనంలోనే ల్యాబ్ కూడా ఉంటుంది. అవసరమైన పరీక్షలు నిర్వహిస్తారు. మరింత మెరుగైన వైద్యం అవసరమైతే టెలి మెడిసిన్ ద్వారా నిపుణులైన వైద్యులతో సంప్రదించి చికిత్స చేస్తారు. పశువును మరో ఆస్పత్రికి తరలించడానికి వీలుగా హైడ్రాలిక్ క్రేన్ (2 వేల కిలోల బరువును ఎత్తే సామర్థ్యం) కూడా వ్యాన్‌లో ఉంటుంది. మూడు రోజుల పాటు ఆ ఆస్పత్రిలో పశువుకు వైద్యం అందే ఏర్పాట్లు చేస్తారు. పశువులకు వైద్యంతో పాటు మందులనూ ప్రభుత్వం ఉచితంగానే సమకూరుస్తుంది. కాగా మొబైల్ అంబులేటరీలో వైద్య సేవలందించడానికి జీవీకే సంస్థ పశువైద్యులను నియమించింది.
ఇప్పటికే మొదలైన కాల్స్..
ప్రభుత్వం సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెస్తున్న విషయాన్ని పశువైద్యాధికారులు వివిధ గ్రామాల్లో తెలియజేస్తున్నారు. దీంతో కొన్ని చోట్ల రైతులు అప్పుడే పశు వైద్యం కోసం ఫోన్ల ద్వారా వాకబు చేస్తున్నారు. త్వరలోనే వీటి సేవలు ప్రారంభమవుతాయని వారికి సమాధానం చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ వాహనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించనున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం..
ఇన్నాళ్లూ పశు వైద్యం కోసం ఇతర గ్రామాలకు పశువులను తీసుకెళ్లడానికి రైతులకు కష్టతరమవుతోంది. అన్ని పనులు మానుకుని వెళ్లడం ఇబ్బందికరంగా ఉంటోంది. ఇకపై ఆ ఇబ్బందులుండవు. 1962 టోల్‌ఫ్రీకి ఫోన్ చేస్తే సంచార వాహనంలో వైద్యులే అక్కడకు వెళ్లి ఉచిత వైద్యమందిస్తారు. ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్న సంచార పశువైద్య సేవల గురించి కొన్నాళ్లుగా గ్రామాల్లో రైతులకు వివరిస్తున్నాం. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.
– కె.విద్యాసాగర్, జేడీ, పశుసంవర్ధకశాఖ
Comments
Please login to add a commentAdd a comment