ట్రెండ్‌: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు! | Modern Wedding Invitation In Software Engineer | Sakshi
Sakshi News home page

ట్రెండ్‌: 12 రోజుల్లో పెళ్లి.. పది నిమిషాల్లోనే ముగించేశారు!

Published Mon, Oct 7 2024 11:48 AM | Last Updated on Mon, Oct 7 2024 12:42 PM

Modern Wedding Invitation In Software Engineer

స్మార్ట్‌గా ఇన్విటేషన్లు 

డిజిటల్‌ కార్డులతో పిలుపులు 

వీడియోలతో వాట్సాప్‌ మెసేజ్‌లు 

ప్రింటింగ్‌ కార్డు సంస్కృతిని వదిలేసిన ప్రజలు

తిరుపతికి చెందిన శ్రీనివాస్‌ కుమారుడు యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన తన కొడుకు వివాహానికి ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల్లోని బంధుమిత్రులకు ఆహా్వనం పంపేందుకు సన్నాహాలు చేపట్టారు. సమయం కేవలం 12 రోజుల మాత్రమే ఉండడంతో అందరికీ పత్రికలు పంచేందుకు వీలుకాని పరిస్థితి. కుమారుడి సలహా మేరకు బెంగళూరుకు వెళ్లి క్యూర్‌ స్కానర్‌తో వీడియో వెడ్డింగ్‌ కార్డులు, ఏటీఎం తరహాలో డిజిటల్‌ కార్డులు డిజైన్‌ చేయించారు. కేవలం 10 నిమిషాల్లోనే వాట్సాప్‌ ద్వారా బంధుమిత్రులకు ఆహ్వానం పలికేశారు. సరికొత్త ట్రెండ్‌తో అందించిన పెళ్లిపిలుపుపై ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు.

తిరుపతి సిటీ : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వివాహ, శుభకార్యాలకు ఆహ్వానించే విధానం వినూత్నంగా మారింది. గతంలో వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రులకు పిలవాలంటే కనీసం నెలరోజుల ముందుగా వెడ్డింగ్‌ కార్డులు ముద్రించి వ్యయ ప్రయాసలకోర్చి గడపగడపకు వెళ్లి పంచాల్సి వచ్చేది. మారుతున్న కాలంతో పాటు అది కాస్తా ఫోన్‌ కాల్స్, మెసేజ్‌ల రూపంలోకి వచ్చేసింది. డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆధునిక యుగంలో ఆహా్వన పత్రికలు వీడియో వెడ్డింగ్‌ కార్డుల రూపంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరింత ముందుకు వెళ్లిన అడ్వాన్డ్స్‌ టెక్నాలజీతో ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్‌ కోడ్‌తో డిజిటల్‌ వెడ్డింగ్‌ కార్డులు వచ్చేశాయి.  



ఏటీఎం తరహాలో కార్డులు 
పెళ్లికి బంధుమిత్రులను పిలించేందుకు క్యూఆర్‌ కోడ్‌తో ప్రింట్‌ చేసిన ఏటీఎం తరహా కార్డులు ప్రస్తుతం మార్కెట్‌లో విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. వీడియో వెడ్డింగ్‌ ఇని్వటేషన్స్‌తో పాటు ఉన్నతస్థాయి బంధుమిత్రుల కోసం విజిటింగ్‌ కార్డ్స్‌ రూపంలో ఉండే డిజిటల్‌ వెడ్డింగ్‌ కార్డులు పంపుతున్నారు. ఏపీలో తొలిసారి పశి్చమగోదావరి జిల్లాలో ఓ కాంట్రాక్టర్‌ తన కుమారుడి వివాహం కోసం ఈ తరహా కార్డులను తయారు చేయించారు. ఇందులో కార్డుపై భాగంలో వధూవరుల ఫొటో, పేర్లు, ఆహా్వనించు తల్లిదండ్రుల పేర్లు మాత్రమే ఉంటాయి. వెనుక భాగంలో క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి ఉంటుంది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వివాహనికి సంబంధించిన పూర్తి వివరాలు కనిపిస్తాయి. పెళ్లిమండపం అడ్రస్, లొకేషన్‌ మ్యాప్, పెళ్లి పత్రిక, విందు టైమింగ్స్, ముహూర్త సమయంతో పాటు సంప్రదించాల్సిన వధువు, వరుడి తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లు పొందుపరిచి ఉంటాయి.

ఇప్పుడు ఇదే ట్రెండ్‌ 
డిజిటల్‌ యుగంలో యువత బర్త్‌ డే, ఎంగేజ్‌మెంట్, గ్రాడ్యుయేషన్, బేబీ షవర్, ఆఫ్‌ శారీ ఫంక్షన్స్, గృహప్రవేశాలు వంటి అన్ని శుభకార్యాలకు వీడియో కార్డుల ద్వారా ఆహా్వనాలను వాట్సాప్‌లో పంపుతున్నారు. ఇంటర్నెట్, కంప్యూటర్‌పై అవగాహన ఉన్న ప్రతి వ్యక్తీ ఉచిత టెంప్లెట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమకు నచ్చిన డిజైన్‌లలో ఆహ్వాన పత్రికలను తయారు చేసేస్తున్నారు. కరోనా తర్వాత ఆహా్వనాలను డిజిటల్‌ పద్ధతిలో పంపేందుకే ప్రజలు ఇష్టపడుతున్నారు.  

ప్రింటింగ్‌ కార్డులపై తగ్గిన మోజు 
వివాహ మహోత్సవంలో ప్రధాన భూమిక పోషించే వెడ్డింగ్‌ కార్డులు కాలానుగుణంగా రూపు మార్చుకుంటున్నాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ కార్డులతో మొదలైన పెళ్లి పత్రికలు తర్వాత కలర్, యూవీ, లేజర్, ఫొటో ప్రింట్, సౌండ్‌ సిస్టమ్‌ కార్డులుగా మారాయి. ఈ ట్రెండ్‌ కొంతకాలం కొనసాగింది. రూ.2 నుంచి సుమారు రూ.20 వరకు ఒక్కోకార్డు «ప్రింటింగ్‌ ధర ఉండేది. ప్రస్తుతం నయా ట్రెండ్‌ మొదలైంది. డిజిటల్‌ యుగంలో వీడియో వెడ్డింగ్‌ కార్డులు మార్కెట్‌ను శాసించాయి. ప్రస్తుతం క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌తో రూపొందించిన డిజిటల్‌ కార్డుల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీంతో ప్రింటింగ్‌ ప్రెస్‌ దుకాణాలు వెలవెలబోతున్నాయి.

విశేషంగా స్పందన 
మా కాబోయే అల్లుడు లండన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. మాది కొత్త బంధుత్వం. ఆగస్టు 14న బెంగళూరులోని కల్యాణ మండపంలో సెపె్టంబర్‌ 2న వివాహం జరిపేందుకు పండితులు ముహూర్తం పెట్టారు. వధువరూలు ఆగస్టు 20న ఇండియాకు వచ్చారు. పదిరోజులు మాత్రమే సమయం ఉంది. బంధుమిత్రులకు ఎలా ఆహా్వనం పంపాలనే ఆలోచనలో పడ్డాం. మా అల్లుడి సలహాతో ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న డిజిటల్‌ కార్డులను తయారు చేసి అందరికీ వాట్సాప్‌ ద్వారా పంపించాం. బంధుమిత్రులు ఇబ్బంది లేకుండా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసుకుని కల్యాణ మండపానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. చాలా సంతోషంగా అనిపించింది. 
– కోటేశ్వరరావు, తిరుపతి

ప్రింటింగ్‌ కార్డులు తగ్గాయి 
గతంలో ప్రతి ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో సుమూహూర్తాలు ఉన్నందున పెళ్లికార్డుల ప్రింటింగ్‌కు ప్రజలు ఎగబడేవారు. బిజినెస్‌ అంతా ఆ మూడు మాసాల్లోనే జరిగేది. నగరంలోని ప్రతి ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్విరామంగా పనిచేసేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంత వాసులు మాత్రం అడపాదడపా తక్కువ క్వాంటిటీతో పెళ్లి పత్రికల కోసం వస్తున్నారు. సుమారు 50 శాతానికి పైగా బిజినెస్‌ తగ్గింది. కంప్యూటర్‌ కాలం, డిజిటల్‌ ఫోన్లు రాకతో పత్రికలకు డిమాండ్‌ భారీగా పడిపోయింది. 
– వెంకటేశ్వర్లు, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని, తిరుపతి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement