దేశ న్యాయవ్యవస్థలో 50 శాతం పైగా మహిళలు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్
తిరుపతి సిటీ/తిరుమల: ‘జస్టిస్ ఫర్ ఆల్’ అనేది మన లక్ష్యమని.. అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, యువత కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి విచ్చేసిన ఆయన శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన బీఏ ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పదో వార్షికోత్సవ సభలో విద్యార్థులను ఉద్దేంచి ప్రసంగించారు.
ఎస్వీయూను 1982లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తన తండ్రి సందర్శించారని చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. నాణ్యమైన విద్యకు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరని, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ ద్వారా సమాజానికి అత్యున్నతమైన న్యాయవాదులను అందించడం శుభపరిణామమని అన్నారు. లా కోర్సును గతంలో రెండవ డిగ్రీగా చూసేవారని.. డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రాధాన్యత ఉండేదన్నారు.
ప్రస్తుతం యువత న్యాయశాస్త్ర అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. న్యాయశాస్త్రం క్రమశిక్షణకు మారుపేరన్నారు. విద్యార్థులు విద్యతో పాటు ఆలోచనాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు ప్రజల సమస్యలను సావధానంగా పూర్తిస్థాయిలో వినడం నేర్చుకోవాలని.. తద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడానికి వీలుంటుందన్నారు.
తిరుమల చేరుకున్న సీజేఐ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు.
సోషల్ ఇంజనీర్లుగా న్యాయవాదులు
సమాజంలో పెద్దఎత్తున మార్పు వచి్చందని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో 50 శాతం పైగా మహిళలు ప్రస్తుతం న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా పనిచేయడం గర్వకారణమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. సమాజంలో వైద్యులు, ఇంజనీర్ల తరహాలో న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లుగా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించి దేశసేవకు అంకితం కావాలని కోరారు.
గురువుల మేధస్సు అసాధారణమైందని.. వారు అందించిన జ్ఞానంతోనే తాను చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఈ సందర్భంగా ఆరుగురు న్యాయాధికారులను ఎస్వీయూ లా కాలేజీ గౌరవ ప్రొఫెసర్లుగా నియమించారు. అనంతరం ఆయనతోపాటు సీజే సతీమణి కల్పనాదాస్ చంద్రచూడ్‌ను వర్సిటీ అధికారులు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి యు.దుర్గాప్రసాద్‌రావు, డిజిగ్నేటెడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మహాలక్ష్మి పావని, వీసీ వి.శ్రీకాంత్‌రెడ్డి, రిజి్రస్టార్ ఒ.మహమ్మద్ హుస్సేన్, ప్రిన్సిపాల్ పద్మనాభం, డీన్ ఆచార్య ఆర్‌సీ కృష్ణయ్య, హైకోర్టు న్యాయవాదులు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment