వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాలి
మౌలిక సదుపాయాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో 12 నుంచి 14 చోట్ల ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లు నిరి్మంచాలన్నది ప్రభుత్వ ఆలోచన అని సీఎం చంద్రబాబు చెప్పారు. ముందుగా కుప్పం, దగదర్తి, నాగార్జున సాగర్, మూలపేటలో వీటిని నిరి్మస్తామన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, కాకినాడ జిల్లా తునిలో కూడా వీటి నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులపై మంగళవారం సచివాలయంలో సీఎం సమీక్షించారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థలను తీసుకురావాలని చెప్పారు.
విమానాశ్రయాల ద్వారా సరకు రవాణా ప్రాజెక్టులు రూపొందించాలని అన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిలిపేసిన, రద్దు చేసిన అన్ని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించాలని ఆయన ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మారిటైం బోర్డు, ఏపీ మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వివిధ ప్రాజెక్టుల్లో స్పెషల్ పర్పస్ వెహికల్స్, ఏపీ ఇన్‌లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని చెప్పారు. అన్ని పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఏపీ మారిటైం మాస్టర్ ప్లాన్‌తో పాటు మారిటైం పాలసీ తెస్తామని తెలిపారు.
జీఏడీ పరిధిలోకి ఏవియేషన్ కార్పొరేషన్
ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్‌ను జీఏడీ పరిథిలోకి, డిజిటల్ కార్పొరేషన్‌ను ఐ అండ్ పీఆర్ పరిథిలోకి తేవాలని సీఎం చెప్పారు. ఏపీ టవర్స్ కార్పొరేషన్‌ను స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్‌లో విలీనం చేయాలన్నారు. కంటెంట్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, టవర్స్ కార్పొరేషన్, గ్యాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌లను గాడిలో పెట్టాలని ఆదేశించారు.
అత్యంత ప్రాధాన్యతగా ‘పోలవరం’
పోలవరం ప్రాజెక్టు పనులను అత్యంత ప్రాధాన్యతగా చేపట్టి పూర్తిచేస్తామని సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని రెండు సీజన్లలో పూర్తిచేసి.. ప్రధాన డ్యాం పనులు చేపట్టాలని సూచించారు. వెలగపూడిలోని సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గోదావరి–పెన్నా, వంశధార–నాగావళి నదుల అనుసంధానం ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. తద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. గోదావరి డెల్టా కంటే ముందుగా కృష్ణా డెల్టాలో వ్యవసాయ పనులు మొదలయ్యేలా పూర్తిస్థాయిలో నీటిని అందుబాటులో ఉంచాలన్నారు.
యూట్యూబ్, గూగుల్ హెడ్‌లతో వర్చువల్ సమావేశం
యూట్యూబ్ గ్లోబల్ సీఈవో నీల్‌మోహన్, గూగుల్ ఏపీఏసీ హెడ్ సంజయ్‌గుప్తాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీలో పెట్టుబడులకు సంబంధించిన పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment