సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కులగణన ప్రక్రియ నాలుగింట మూడు వంతులకుపైగా పూర్తయింది. కులగణనను ఈ నెల 19 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా డేటా సేకరించింది. దీని ప్రకారం.. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ఉన్నారు.
ఈ నేపథ్యంలో కులగణన ప్రక్రియను పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో చేపట్టేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను కూడా సిద్ధం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు వారి పరిధిలో ఇంటింటికీ వెళ్లి గత 8 రోజులుగా ప్రజల సామాజిక, ఆరి్థక స్థితిగతుల వివరాలను నమోదు చేస్తున్నారు.
ఇలా ఇప్పటివరకు 1,33,65,550 కుటుంబాలకు సంబంధించిన 3.39 కోట్ల మంది వివరాలను నమోదు చేశారు. ఇప్పటివరకు మొత్తం 79.59 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తవగా.. శనివారం 3.60 శాతం కుటుంబాల వివరాలను నమోదు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 86.71 శాతం కుటుంబాల వివరాల నమోదు పూర్తి కాగా, అత్యల్పంగా పల్నాడు జిల్లాలో 71 శాతం పూర్తయినట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment