సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన పటిష్ట చర్యలతో ఆలయాలపై దాడులు తగ్గుముఖం పట్టాయి. 2020లో ఆలయాలపై 145 దాడులు జరిగినప్పటికీ వీటి ప్రధాన కుట్రదారులు టీడీపీ నేతలే. ఈ కేసుల్లో ఇంతవరకు 25మంది టీడీపీ నేతల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇందులో 21మంది అరెస్టయ్యారు కూడా. (చదవండి: 523 పంచాయతీల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవం)
అంటే.. అధికారంలో ఉంటే ఆలయాలకు రక్షణ కల్పించలేని అసమర్థత..
ప్రతిపక్షంలోకి రాగానే వాటిపై దాడులకు పాల్పడి మత ఘర్షణలు రేకెత్తించాలనే పన్నాగం.. ఇదీ టీడీపీ నైజం. రాష్ట్ర పోలీసు శాఖ వెల్లడిస్తున్న పచ్చి నిజాలూ ఇవే.
పోలీసుల ద్విముఖ వ్యూహం
ఎవరెన్ని కుట్రలు పన్నుతున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. సీఎం వైఎస్ జగన్ విస్పష్ట ఆదేశాలతో పోలీసు శాఖ ద్విముఖ వ్యూహంతో దూసుకుపోతోంది. ఓ వైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరోవైపు ప్రజలను భాగస్వాములుగా చేసుకుంటూ కార్యాచరణ చేపట్టింది. దీంతో పోలీసు చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే కేసులను ఛేదిస్తున్నారు. అందుకే ఈ విషయంలో ఇతర రాష్ట్రాలూ ఏపీ చర్యలపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. అవి ఏమిటంటే..
జియో ట్యాగింగ్.. సీసీ కెమెరాల ఏర్పాటు
♦ఇంతవరకు 59,433 ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్‌తో మ్యాపింగ్ చేశారు.
♦వీటికి సెక్యూరిటీ ఆడిటింగ్ నిర్వహించి వాచ్‌మెన్‌లను నియమించారు. అగ్నిమాపక పరికరాలు, జనరేటర్లనూ ఏర్పాటుచేశారు.
♦కొత్తగా 14,424 ఆలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద 48,159 సీసీ కెమెరాలు నెలకొల్పారు.
మత సామరస్య పరిరక్షణ కమిటీలు..
♦ఆలయాలు, ప్రార్థనా మందిరాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రజలనూ భాగస్వాములను చేస్తోంది. అన్ని మతాల పెద్దలతో సమావేశం నిర్వహించి కార్యాచరణ చేపట్టింది.
♦మత సామరస్య పరిరక్షణకు రాష్ట్ర, జిల్లా, పోలీసుస్టేషన్ స్థాయిలలో కమిటీలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం సమాచార పంపిణీకి ప్రత్యేక కాల్ సెంటర్ పెట్టారు.
♦గ్రామాల్లోకి అసాంఘిక శక్తులు, బయట శక్తులు రాకుండా కట్టడి చేసేందుకు గ్రామ రక్షణ దళాలను ఏర్పాటుచేస్తోంది. ఒక్కో దళంలో 8–12 మంది చొప్పున ఉంటారు.
♦ఇలా రాష్ట్రవ్యాప్తంగా 23,082 కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఇంతవరకు 18,901 కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలు ఇప్పటివరకు 30మంది ఆగంతులను పట్టుకున్నాయి.
కుట్రదారులకు పోలీసుల చెక్
మరోవైపు.. పోలీసులు కూడా కుట్రదారులు, అసాంఘిక శక్తుల ఆట కట్టిస్తున్నారు. 4,878 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. వారిలో ఆలయాలపై దాడులకు పాల్పడిన చరిత్ర ఉన్నవారు 1,898 మంది కాగా.. మతకల్లోలాల చరిత్ర ఉన్నవారు 2,980మంది.
♦గత సెప్టెంబరు 5న అంతర్వేది సంఘటన అనంతరం పోలీసులు ఇంతవరకు ఆలయాలపై దాడులకు సంబంధించిన కేసుల్లో 378 మందిని అరెస్టుచేశారు.
♦ఆలయాల్లో దోపిడీలకు పాల్పడుతున్న ఏడు అంతర్రాష్ట్ర ముఠాలను అరెస్టు చేశారు.
♦2020–21లో ఇంతవరకు ప్రధానంగా 46 కేసులు నమోదు కాగా వాటిలో 34 కేసులను పోలీసులు ఛేదించారు.
♦ఆలయాలపై దాడులకు సంబంధించిన ప్రధాన కేసుల విచారణకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ఏర్పాటుచేశారు. ఈ బృందం ఇప్పటికే మూడింటిని 20 రోజుల్లోనే ఛేదించింది.
♦పెండింగ్ కేసుల శీఘ్ర విచారణకు ప్రత్యేక బృందాలను నియమించారు.
టీడీపీ హయాంలోనే అత్యధికంగా..
చంద్రబాబు హయాంలోనే అత్యధికంగా ఆలయాలపై దాడులు జరిగాయి. ఒక్క 2016లోనే 200 దాడులు జరిగాయి. వాటిలో విగ్రహాల ధ్వంసం కేసులు 33, ఆలయాలు విధ్వంసం కేసులు 34 ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఆలయాలపై దాడులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
వైఎస్సార్‌సీపీ సర్కారును అస్థిరపర్చేందుకే..
♦ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు టీడీపీ మతవిద్వేషాలు సృష్టించాలని కుట్ర పన్నింది.
♦రాజమహేంద్రవరంలో డిసెంబర్ 31న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతిని టీడీపీ నేతలే ధ్వంసం చేశారు. ఆలయ పూజారీకి డబ్బు ఎరవేసి మరీ తమ కుట్రను అమలుచేశారు. ∙ఇక శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో టీడీపీ నేతలే ఆలయంలోని నంది విగ్రహాన్ని పెకలించిన విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది కూడా.
♦సింగరాయకొండలో ఆలయ స్వాగతతోరణంలోని విగ్రహం ధ్వంసం అయ్యిందని, రాజమహేంద్రవరంలో విగ్రహాన్ని అపవిత్రం చేశారని.. టీడీపీ నేతలు విష ప్రచారం చేశారు.
.. ఇలా ఇప్పటివరకు 29 కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిగ్గుతేల్చారు. వీరిలో 25మంది టీడీపీ నేతలు కాగా.. నలుగురు బీజేపీ వారున్నారు. టీడీపీ నేతల్లో 21మంది అరెస్టయ్యారు. నలుగురు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment