సీటీ స్కాన్ ద్వారా శరీర భాగంలో ఉన్న ఇనుప రాడ్డును గుర్తించిన దృశ్యం
సాక్షి, తిరుపతి తుడా: కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన తాపీ మేస్త్రి కె.లక్ష్మయ్యకు తిరుపతి స్విమ్స్ వైద్యులు సోమవారం అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. శనివారం తాపీ పని చేస్తూ ప్రమాదవశాత్తు లక్ష్మయ్య కిందపడ్డాడు. నిర్మాణ దశలో ఉన్న ఇంటిపై పడడంతో తొడ భాగంలో గుచ్చుకున్న ఇనుప కడ్డీ భుజం నుంచి బయటకు చొచ్చుకుని వచ్చింది. స్థానికులు అతన్ని కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్స ద్వారానే ఇనుప కడ్డీని శరీరం నుంచి తీయాల్సి రావడంతో వైద్యులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఆదివారం బాధితుడ్ని స్విమ్స్ అత్యవసర విభాగంలో చేర్పించారు.
స్విమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, సీటీసర్జరీ, అనస్థీషియా విభాగాల వైద్యులు పేషెంట్ స్థితిగతులను వైద్య పరీక్షల ద్వారా గుర్తించారు. 10 ఎంఎం సైజు ఇనుప కడ్డీ దాదాపు మూడు అడుగుల పొడవు అతని శరీర భాగంలోకి చొచ్చుకుని పోయిందని నిర్ధారించారు. అతిక్లిష్టమైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి బాధితుడికి ప్రాణం పోశారు. శరీర భాగంలోని అవయవాలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకుని ఆ ఇనుప కడ్డీని శరీరం నుంచి వేరు చేశారు. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి, డాక్టర్ సత్యవతి, డాక్టర్ మధుసూదన్‌ల బృందాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ వెంగమ్మ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment