గన్నవరం విమానాశ్రయంలో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న అధికారులు
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్ర విద్యార్థులను వెనక్కి తీసుకుచ్చే కార్యక్రమం దాదాపు పూర్తయ్యింది. సోమవారం రాత్రి అక్కడ బయలుదేరిన మరో 50 మంది విద్యార్థులు మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. దీంతో ఇప్పటివరకు 600 మంది వరకు విద్యార్థులను క్షేమంగా చేర్చినట్లు ఏపీఎన్‌ఆర్టీ ప్రెసిడెంట్ వెంకట్ మేడపాటి ‘సాక్షి’కి తెలిపారు. వివిధ వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఉక్రెయిన్‌లో సుమారు 770 మంది రాష్ట్రానికి చెందిన విద్యార్థులు చిక్కుకున్నట్లు అంచనా వేసిన ప్రభుత్వం అందులో 600 మందిని విజయవంతంగా వారి స్వస్థలాలకు చేర్చింది.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం రూ.2.70 కోట్లు విడుదల చేసింది. హంగేరి నుంచి రాష్ట్ర విద్యార్థుల తరలింపు దాదాపు పూర్తయిందని, ఇందుకు సహకరించిన స్థానిక వలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దన్యవాదాలు తెలిపామని వెంకట్ మేడపాటి చెప్పారు. ఇంకా ఒకరిద్దరు విద్యార్థులు ఉంటే స్థానిక ఎంబసీ సహకారంతో తీసుకొస్తామన్నారు. కొంతమంది విద్యార్థులు సొంతంగా స్వరాష్ట్రానికి చేరుకున్నారని, మరికొంతమంది రష్యా, ఆస్ట్రేలి యాల్లోని వారి బంధువుల ఇళ్లకు చేరుకున్నారనే సమాచారం వస్తోందని చెప్పారు.
ఈ వివరాలన్నీ క్రోడీకరించిన తర్వాత ఉక్రెయిన్ నుంచి ఎంతమంది వెనక్కి వచ్చారనే వివరాలు తెలియజేస్తామన్నారు. రొమేనియా, పోలండ్‌ల నుంచి విద్యార్థుల తరలింపు పూర్తికావడంతో యూరోప్ ప్రత్యేక ప్రతి నిధి రవీంద్రరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రవాసాంధ్ర డిప్యూటీ సలహాదారు చంద్రహాసరెడ్డి తిరిగి వచ్చేస్తున్నారన్నారు. యుద్ధం జరుగుతున్న సుమీ ప్రాంతంలో రాష్ట్రానికి చెందిన 8 మంది విద్యార్థులు ఉన్నట్లు తేలిందని, వీరిని సురక్షితంగా చేర్చడానికి ప్రధాని నరేంద్రమోదీ రెండుదేశాల ప్రధానులతో మాట్లాడుతున్నారని, వీరిని కూడా త్వరలోనే క్షేమంగా రాష్ట్రానికి తీసుకొస్తామని వెంకట్ చెప్పారు.
విజయవాడ చేరుకున్న 16 మంది..
ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి చేరుకున్న విద్యార్థుల్లో రాష్ట్రానికి చెందిన 16 మందిని సోమవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వీరిని ముంబై, ఢిల్లీల నుంచి బెంగళూరు మీదుగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి తీసుకొచ్చింది. విమానాశ్రయంలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వెంకటరత్నం, ఆర్‌ఐ వెంకట్ స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు స్వస్థలాలకు చేరేందుకు రవాణా ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల నుంచి క్షేమంగా తీసుకొచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment