సాక్షి, అమరావతి: త్వరలోనే ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ఒక యాప్‌ను రూపొందిస్తుందని, ఇకపై ఆ యాప్ ద్వారా పాత, కొత్త సినిమాలను కూడా వీక్షించే అవకాశం లభిస్తుందని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి గురువారం చెప్పారు. ఇటీవల విశాఖలో ‘నిరీక్షణ’అనే సినిమాతో రిలీజ్ రోజే థియేటర్‌లో మాదిరిగా కొత్త సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షోని కుటుంబమంతా కలిసి ఇంట్లోనే కూర్చొని వీక్షించే విధానాన్ని ప్రవేశపెట్టామని..దానికి అనూహ్య స్పందన వచ్చిందని తెలిపారు.
ఈ స్ఫూర్తితో ఏపీ ఫైబర్‌నెట్ జూన్ 16న రూ.39 కే ‘లవ్ యూ టూ’ చిత్రాన్ని అందిస్తోందని, దీన్ని ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వివరించారు. సబ్‌స్రై్కబ్ చేసుకున్న తర్వాత 24 గంటల వరకు ఈ సినిమాను చూడవచ్చని చెప్పారు. చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించి, వీక్షకుడికి అతి తక్కువ ధరకే నేరుగా సినిమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని ఇది ఓటీటీలకు, థియేటర్ల యాజమాన్యానికి పోటీ కాదన్నారు.
రూ.100 కోట్ల బడ్జెట్ మూవీకి మొదటి వారంపాటు టికెట్ ధరను పెంచుకునే వెసులుబాటు కల్పించే విధంగా ప్రభుత్వం జీవో 13ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. రూ.20 కోట్లలోపు నిర్మించిన సినిమాలను చిన్న చిత్రాలుగా భావిస్తూ వాటిని కూడా పండుగ రోజుల్లో ప్రతి థియేటర్‌లో పెద్ద చిత్రంతో పాటు ఒక షో చిన్న చిత్రానికి కేటాయించే అవకాశం కల్పించామన్నారు. రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని ఏపీ ఫైబర్‌నెట్ ద్వారా వీక్షించే అవకాశం కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment