ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: ఫర్నీచర్, ప్లాస్టిక్ తయారీ కంపెనీలను ఆకర్షించే విధంగా నెల్లూరు జిల్లా నారంపేట వద్ద ఏపీఐఐసీ చేపట్టిన ఎంఎస్‌ఎంఈ పార్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 100 చిన్న, మధ్య స్థాయి కంపెనీలు ఏర్పాటు చేసేలా 173.67 ఎకరాల్లో దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 36.23 ఎకరాల్లో ప్లాస్టిక్ పార్క్, 25.26 ఎకరాల్లో ఫర్నీచర్ పార్క్ ఏర్పాటు అవుతోంది. పెద్ద ఫర్నీచర్ సంస్థలతో పాటు చిన్న వాటిని కూడా ప్రోత్సహించేందుకు ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
సుమారు రూ.30 కోట్ల వ్యయంతో రహదారులు, మురుగు, వరద నీటి కాల్వల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సెంచురీ ప్లే వంటి భారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఈ పార్కుకు ఆనుకునే మరో 401 ఎకరాలు సేకరించే యోచనలో ఏపీఐఐసీ ఉంది. ఈ ఎంఎస్‌ఎంఈ పార్క్‌లో మొత్తం 73.91 ఎకరాల్లో కంపెనీలు తమ యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి 323 ప్లాట్‌లను అభివృద్ధి చేస్తున్నారు.
అలాగే 10.05 ఎకరాల్లో రెడీ బిల్ట్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నారు. ఇదే పారిశ్రామికవాడలో 5.49 ఎకరాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. 21.38 ఎకరాలు మొక్కల పెంపకానికి కేటాయించారు. ప్రస్తుతం మౌలిక వసతులు కల్పన పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయిన తర్వాత ఫ్యాక్టరీ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment