ఆన్లైన్లో సంగీతం నేర్పుతున్న కొణికి సుష్మ
చీరాల అర్బన్: ఒక కమ్మని పాటకు శ్రుతి ఎంతో ప్రధానం. లయబద్దంగా సాగే పాటకు శ్రుతి సక్రమంగా ఉంటేనే ఆ పాట శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రుతి, లయను సమ్మోహనంగా మిళితం చేసి గానం చేస్తే ఆ పాట సంగీత ప్రియులను రంజింప చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సంగీతాన్ని అందరికీ పంచే కళాకారులు జిల్లాలో ఎందరో ఉన్నారు. అలానే జానపద కళాకారులు, సుమధుర గాత్రంతో రంగస్థలంపై ఏకపాత్రాభియం చేస్తూ నాటకాన్ని రక్తికట్టేంచే వారూ లేకపోలేదు. ఎంతో మంది ప్రముఖులతో సన్మానాలందుకున్న కళాకారులు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. శ్రుతిలయలను నమ్ముకున్న వారు నేడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు.
సప్త స్వరాలను సమ్మోహనంగా ఆలపించడంతో పాటు సంగీత వాద్యాలను అలవోకగా పలికిస్తూ పలువురికి సంగీత, వాద్య విద్యను చెప్పే కళాకారుల జీవితాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. సంగీత వాద్య కళాకారులకు లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కరువైంది. చీరాల, వేటపాలెం మండలాలల్లో ఎంతో మంది సంగీత, రంగస్థల కళాకారులు ఉన్నారు. వీరిలో చాలా మంది సంగీత, వాద్య కళాకారులు కళను నమ్ముకుని జీవిస్తున్నారు. ఒకప్పుడు చీరాలలోని వాణి కళానికేతన్ లో ఎంతో మంది సంగీతాన్ని నేర్చుకున్నారు. ప్రస్తుతం వారందరూ వేర్వేరు ప్రాంతాలలో స్థిరపడి మంచి సంగీత కళాకారులుగా రాణిస్తున్నారు. చీరాలలో వీణ, వయోలిన్‌తో పాటు సంగీతం చెప్పేవారు కళాకారులు ఉన్నారు. ఒకప్పుడు సంగీత కళలకు పెట్టింది పేరుగా ఉన్న చీరాలలో ప్రస్తుతం తక్కువ సంఖ్యలోనే కళాకారులు ఉన్నారు. కొంతమంది ఇంటివద్దనే సంగీతం
నేర్పుతుండగా, మరికొందరు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సంగీతం, వయోలిన్ నేర్పుతున్నారు. అలానే నాదస్వర కళాకారులకు కూడా కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్‌డౌన్ కారణంగా నాలుగు నెలలుగా శిక్షణ తరగతులు నిర్వహించడంలేదు. కొంతమంది సంగీతం, నాట్యం ఆన్‌లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. విజయవాడకు చెందిన నాట్యకళాకారిణి ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు గంటల పాటు ఆన్‌లైన్‌లో నాట్యం నేర్పుతున్నారు. చీరాలకు చెందిన 20 మంది విద్యార్థులు ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో చూస్తూ నాట్యం నేర్చుకుంటున్నారు. అలానే సంగీతం కూడా అదే మాదిరిగా ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు.
రంగస్థలంపై రాణించినా..!
రంగస్థలంపై ఏకధాటిగా గంటల కొద్ది ప్రదర్శనలు ఇచ్చి ఎందరో ప్రముఖుల చేత సన్మానాలు అందుకున్న కళాకారులు నేడు కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. జానపద కళలు, నాటకాలు, ఏకపాత్రాభినయాలు వంటివి చేసి అందరిని మెప్పించినా ప్రస్తుతం వారికి ఆదరణ కరువైంది. జాండ్రపేటలో నివసించే చల్లా రాజేశ్వరి రేడియో ఆర్టిస్ట్. ఆమెను కళాకారిణిగా గుర్తించి ప్రభుత్వం గుర్తింపు కార్డు అందించింది. ఎన్నో స్టేజి ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు ఇచ్చినా కళాకారుల పెన్షన్ మాత్రం రావడంలేదని వాపోయింది. ఐదు సంవత్సరాలుగా కళాకారులకు ప్రభుత్వం అందించే నగదు కోసం దరఖాస్తులు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కళాకారులను కూడా కరోనా సమయంలో ఆదుకోవాలని వారు విన్నవించుకుంటున్నారు. అలానే వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇటీవల పట్టణంలోని 26 వార్డులో ఉన్న కళాకారులకు నిత్యవసరాలు, కూరగాయలను పంపిణీ చేశారు. కళలకు జీవం పోసే కళాకారుల జీవనం కరోనా వైరస్ కారణంగా కష్ట పరిస్థితుల్లోకి వెళ్లింది.
ఆన్‌లైన్లో సంగీత పాఠాలు..
చీరాల వైకుంఠపురంలోని బాలసాయినగర్‌కు చెందిన కొణికి సుష్మ బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చిన్న వయస్సు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకున్న సుష్మ కర్నాటక సంగీతంలో డిప్లమో పొందింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దనే ఉంటూ తాను నేర్చుకున్న సంగీతాన్ని ఆన్‌లైన్ ద్వారా మరికొందరికి నేర్పుతోంది.
Comments
Please login to add a commentAdd a comment