
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు వెల్లడించింది. ఈ నేపథ్యంలో 2021–22లో ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.3,766.25 కోట్ల రుణాలు అందించాలని నాబార్డు అంచనా వేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం కన్నా 6.2 శాతం అధికమని తెలిపింది. ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలతో పాటు ఆక్వా, డెయిరీ, విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు వివరించింది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాల పరిధిలోనే మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేంద్రాల్లో డ్రై స్టోరేజీ, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లు, ఈ–మార్కెటింగ్, జనతా బజార్లు తదితర సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే 13 జిల్లాస్థాయి ఇంటిగ్రేటెడ్ అగ్రిల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే ఫుడ్–అగ్రి ప్రాసెసింగ్ యూనిట్లపై తాము కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు నాబార్డు ఆ ఫోకస్ పత్రంలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment