
క్రీడాకారుల్లో జోష్ నింపేందుకు కబడ్డీ ఆడుతున్న ఎమ్మెల్యే రోజా, మేయర్ శిరీష
తిరుపతి తుడా: జాతీయస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌తో తిరుపతిని క్రీడాపురిగా తీర్చిదిద్దారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం స్థానిక ఇందిరా మైదానంలో మూడోరోజు కబడ్డీ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని బెస్ట్ ప్లేయర్లకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తిరుపతి ప్రతిష్ట ఇనుమడించేలా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రానికి క్రీడలతో కొత్త సొబగులు వచ్చాయని తెలిపారు. తెలుగు బాష, సంస్కృతి, సంప్రదాయాలకు ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పెద్దపీట వేస్తారని కొనియాడారు.
తిరుపతి ఇందిరా మైదానంలో కబడ్డీ లీగ్ పోటీలను ప్రారంభించి మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి, వేదికపై జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి,
జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, శరీర దారుఢ్యానికి దోహదపడుతాయన్నారు. కబడ్డీ పోటీలతో తిరుపతిలో పండుగ వాతావరణ ఏర్పడిందని తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడ కబడ్డీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. ప్రతిష్టాత్మక టోర్నీని విజయవంతంగా నిర్వహించడం వెనుక తిరుపతి ప్రజలు, వ్యాపారులు, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల సహకారం ఉందని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అత్యున్నతంగా ప్రోటీలను నిర్వహించడం ఎమ్మెల్యే భూమనకే చెల్లిందన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, ఆంధ్ర కబడ్డీ సంఘం కార్యదర్శి యలమంచి శ్రీకాంత్, అదనపు కమిషనర్ హరిత పాల్గొన్నారు.
క్రీడలతో ఆరోగ్యం.. ఆనందం
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా, టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి తిలకించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ జాతీయ క్రీడలను తిరుపతిలో నిర్వహించడం గర్వకారణమన్నారు. క్రీడలతో ఆర్యోగం, ఆనందం దక్కుతుందని తెలిపారు. ఈఓ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు టీటీడీ పూర్తి సహకారం అందించిందన్నారు. క్రీడాకారులకు తమ వంతుగా వసతి సౌకర్యం కల్పించామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే రోజా క్రీడాకారులను పరిచయం చేసుకుని వారిలో జోష్ నింపేందుకు ఆటవిడుపుగా కబడ్డీ ఆడారు. టీటీడీ జేఈఓ సదా భార్గవి, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, మేయర్‌శిరీష, డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, అభినయ్‌రెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment