
శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్: శ్రీశైలం జలాశయం రేడియల్ క్రస్ట్‌గేట్లను గురువారం సాయంత్రం మూసేశారు. మంగళవారం ఇన్‌ఫ్లో పెరగడంతో నాలుగోసారి బుధవారం గేట్లను ఎత్తిన విషయం తెలిసిందే. ఇన్‌ఫ్లో తగ్గుతుండడంతో గురువారం ఉదయం 9 గంటలకు ఒక గేటు, మధ్యాహ్నం మూడుగంటలకు ఒక గేటు, సాయంత్రం ఆరుగంటలకు మరో గేటు మూసేశారు. జూరాల, సుంకేసుల నుంచి జలాశయానికి 96,467 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది.
విద్యుత్ ఉత్పాదన అనంతరం 64,048 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా 72,569 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదిలారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజలస్రవంతికి 1,688 క్యూసెక్కు లు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,186 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 212.4385 టీఎంసీల నీరు ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.40 అడుగులకు చేరింది.
నాగార్జునసాగర్ జలాశయం నాలుగు రేడియల్ క్రస్ట్‌గేట్ల ను ఐదడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా 33,454 క్యూసెక్కులు, నాలుగు గేట్ల ద్వారా 32,316 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ, వరద కాలువలు, ఎస్‌ఎల్‌బీసీకి కలిపి మొత్తం 1,03182 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 589.80 అడుగులు ఉంది. 311.4474 టీఎంసీల నీరు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment