సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి కోరారు. సీబీఐ విచారణ కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని.. ఆయన రాయకపోతే తానే లేఖ రాస్తానన్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీపార్వతి బుధవారం మీడియాతో మాట్లాడారు. తండ్రి ఎన్టీఆర్ చావుకు కారణమైన చంద్రబాబును నమ్మి మోసపోతున్న నందమూరి కుటుంబాన్ని చూస్తే జాలేస్తుందని చెప్పారు. హరికృష్ణ మరణానికి కూడా బాబే కారణమని ధ్వజమెత్తారు. చంద్రబాబు కారణంగా హరికృష్ణ మానసిక క్షోభ అనుభవించాడని గుర్తు చేశారు.
ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదు..
ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి మరణం తనను కలచివేసిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమనే అనుమానం కలుగుతోందన్నారు. ఆత్మహత్యకు ముందు ఉమామహేశ్వరి రాసిన సూసైడ్ నోట్ చంద్రబాబు అక్కడకు చేరాకే మాయమైందన్నారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలని చెప్పారు. ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలోనే లేదన్నారు. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారని.. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆమె సూసైడ్ నోట్ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
కోడెల మృతికీ బాబే కారణం..
గతంలో కోడెల శివప్రసాదరావు మరణానికి కూడా చంద్రబాబే కారణమని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఆయనను బాబు చాలా దారుణంగా మోసం చేశాడన్నారు. అదే వి«షయాన్ని కోడెల స్వయంగా తన ఫోన్‌లో రికార్డు చేసుకున్నారని చెప్పారు. దాంతో ఆ ఫోన్‌నే మాయం చేశారన్నారు. కోడెలను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి కాకుండా దూరంగా ఉన్న బసవతారకం ఆస్పత్రికి తీసుకుపోయారని గుర్తు చేశారు. దీంతో ఆయన మరణించారన్నారు. ఆ తర్వాత కోడెల భౌతికకాయాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏ స్థాయిలో రాజకీయాలు చేశాడో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వినియోగించుకున్నాడని మండిపడ్డారు. ఆ తర్వాత తన కొడుకు కోసం అదే జూనియర్ ఎన్టీఆర్‌ను దూరం చేశాడన్నారు. చివరకు ఆయన సినిమాలకు కూడా అడ్డుపడ్డాడని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ కుటుంబంలో శని.. చంద్రబాబు
ఎన్టీఆర్ కుటుంబంలోకి శనిలా చంద్రబాబు ప్రవేశించారని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. బాబు ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారణమై ఆ పేరును వాడుకుం టున్న దుర్మార్గుడు బాబని ధ్వజమె త్తారు. పార్టీ పేరుతో రూ.లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు. చంద్ర బాబు వెంటనే ఎన్టీఆర్ కుటుంబాన్ని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. బాల కృష్ణకు బాధ్యతలు అప్పగించాలన్నారు. ఎన్టీఆర్ చిన్న కూతురు ఆత్మహత్య అంతా ఓ మిస్టరీలా ఉన్నా.. సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయన్నారు. బాబు మనస్తత్వం, అతడి నీచ, హత్యా రాజకీయాలు తెలిసిన ఎవరైనా కొన్నిం టిని అనుమానించక తప్పదని చెప్పారు. శవ రాజకీయాలు చంద్రబాబుకు వెన్న తో పెట్టిన విద్య అన్నారు. హరికృష్ణ మరణానికీ పరోక్షంగా బాబే కారణమని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ ఇప్ప టికీ ఆయనతో మాట్లాడరని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment